మహిళా బిల్లు గట్టెక్కేనా? | Will Pass Women's Reservation Bill in the Monsoon Session of Parliament | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 2 2017 12:57 AM | Last Updated on Thu, Nov 2 2017 1:25 AM

Will Pass Women's Reservation Bill in the Monsoon Session of Parliament - Sakshi

విశ్లేషణ

జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లభించకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధి మెరుగ్గా ఉంటున్నాయి. మహిళా ప్రతినిధు లున్న గ్రామాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, బాలికా విద్య, అంగన్‌వాడీలు మొదలైనవి మెరుగ్గా పనిచేస్తున్నట్లు రుజువైంది. ఈ మార్పు జాతీయ స్థాయిలో ప్రతిఫలించాలంటే.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం నిర్ణయాత్మక స్థాయికి పెరగడం అవసరం.

ఎన్నికలు సమీపిస్తే చాలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంశాలు  తెరపైకి వస్తుంటాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ముందుగానే,  2018 నవంబర్‌లో జరుగవచ్చని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్‌ బిల్లు మరోసారి రానున్న పార్లమెంటు సమావేశాలను కుదిపివేసేలా ఉంది. ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే ఆ పార్టీ మహిళా బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది మహిళల సంతకాలను సేకరించే పనిలో ఉంది. పంచాయతీలు, పురపాలక సంఘాల్లో మహిళలకు రిజర్వేషన్‌లను కల్పించామని చాటుకుం టున్న కాంగ్రెస్‌... మహిళా బిల్లు ఆమోదం పొందితే అది కూడా తమ ఘన తేనని చెప్పుకోవచ్చని  తాపత్రయపడుతున్నది. అధికార బీజేపీ గత మూడేళ్లుగా ఈ బిల్లుపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకాలు లేకున్నా, దాన్ని పట్టాలకెక్కించాలన్న సంకల్పం ఆ పార్టీలో కనపడటం లేదు.

ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే దాన్ని పక్కన పెడితే ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ లభి స్తుంది. అంటే పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం ఇప్పుడున్న దానికి (12%) దాదాపు 3 రెట్లు పెరుగుతుంది. అయితే, ఈ బిల్లు చట్టంగా రూపొందడం అంత సులువేమీ కాదు. లేకపోతే రెండు దశాబ్దాల క్రితమే అది జరిగి ఉండేది. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని అనిపించుకోవడం కోసమే కొన్ని పార్టీలు మహిళల హక్కులు, వారి సమానత్వం గురించి ఉపన్యాసాలు, మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నాయి. ఆచరణలో అందుకు ఎలాంటి చొరవనూ చూపటం లేదు. మహిళా బిల్లుపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మధ్య, ప్రధానంగా పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి.  

రెండు దశాబ్దాలైనా ఎక్కడి గొంగళి అక్కడే
రెండు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసాయిదాను 1996లో దేవేగౌడ ప్రధానిగా ఏర్పడ్డ యునైటెడ్‌ ఫ్రండ్‌ ప్రభుత్వం లోక్‌సభలో చర్చకు పెట్టింది. ఆ సందర్భంగా సభలోని వివిధ రాజకీయ పక్షాల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ఏకాభిప్రాయం కుదరక, అది వీగిపోయింది. తదుపరి, ఈ బిల్లును చర్చకు పెట్టిన ప్రతి సందర్భంలోనూ సభలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఆనవాయితీగా మారింది. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం సభలో బిల్లును ప్రవేశపెట్టారు. కానీ, ఆర్జేడీకి చెందిన ఓ పార్లమెంట్‌ సభ్యుడు బిల్లు కాపీలను స్పీకర్‌ వద్ద నుంచి లాక్కొని చించివేశారు. ఆ తదుపరి 1999, 2002, 2003లలో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం మొండి చెయ్యి చూపడం సాగింది. చివరకు 2010 మార్చి, 9న కేంద్ర, రాష్ట్రాల చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 15 ఏళ్ల పాటూ ఈ చట్టం అమలులో ఉన్న తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న నిబంధనను బిల్లు ముసాయిదాలో చేర్చారు. అయినా, రాజ్యసభ ఆమోదం పొంది 17 ఏళ్లు గడిచినా లోక్‌సభ ఆమోదానికి అది నోచుకోవడం లేదు. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల మద్దతున్నా మహిళా బిల్లు గట్టెక్కక పోవడానికి కారణం లోక్‌సభలో పురుషాధిక్య భావజాలంలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని పార్టీల వైఖరి అనేది విస్తృత జనాభిప్రాయం.

ఈ రిజర్వేషన్లలో ఉపకోటా ఉండాలని ఓబీసీలు, ముస్లిం మైనార్టీ వర్గాలు పట్టుబడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకున్న రిజర్వేషన్ల దామాషా ప్రకా రమే ఆ వర్గాల మహిళలకు ఈ 33 శాతంలో 22.5 శాతం రిజర్వేషన్లు లభి స్తాయి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు 27%, ముస్లిం మైనార్టీలకు 10% రిజర్వేషన్లను కల్పించాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. అందుకు మరి కొన్ని పార్టీలు అంగీకరించడం లేదు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఇక, దేశంలోని ఓబీసీల జనాభా లెక్కల వివరాలు 1935 నాటివే తప్ప, మరెలాంటి ఆధారపడదగిన సమాచారం లేదు. పైగా ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే సాంఘిక హోదా లేదు. పలు రాష్ట్రాలు.. బీసీ కులాల జనాభా లెక్కలను నేటికీ తయారు చేయలేకపోయాయి. మహిళలకు ఇచ్చే 33% రిజర్వేషన్లు ఉన్నత రాజకీయ వర్గాల కుటుంబాల నుంచి వచ్చే మహిళలకే ఉపయోగపడుతుందని కొందరి అభ్యంతరం. ఉప కోటా సాధ్య పడకపోయినా, మహిళా రిజర్వేషన్లను ఉన్నత వర్గాల వారే మొదట ఉపయోగించుకోగలిగినా, ఆ పరిస్థితి కొనసాగదు. కనుక, ఉప కోటా సాకుతో మహిళా బిల్లునే అడ్డగించడంలో ఔచిత్యం కనపడదు.

సంకీర్ణ ధర్మం కాంగ్రెస్‌ మార్కు సాకు
2004 నుండి 2014 వరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ–1, యూపీఏ–2  ప్రభుత్వాలు పదేళ్లు అధికారాన్ని చెలాయించాయి. పలు తర్జన భర్జనల తదుపరి యూపీఏ–2 ఈ బిల్లును 2010లో రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదాన్ని సంపాదించింది. అయినా అది లోక్‌సభ ఆమోదాన్ని పొందలేకపోవడం కాంగ్రెస్‌ వైఫల్యమేనని చెప్పాలి. తమది సంకీర్ణ ప్రభుత్వం కనుక, భాగస్వామ్య పార్టీల మద్దతును కూడగట్టలేకపోయామని కాంగ్రెస్‌ సాకును వెతుక్కొంది. ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదని అదే ప్రభుత్వం వివాదాస్ప దమైన 123 నిబంధనతో సహా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చు కుంది. ఆ పట్టుదలను మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో అది చూపలేకపోయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్, సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ల బెదిరింపులకు లొంగి కాంగ్రెస్‌ దాన్ని అటకెక్కించింది.

భారత్‌ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంటున్న ప్రస్తుత తరుణంలో కూడా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 12.15%కు పరిమితం కావడం.. మహిళల పట్ల చూపుతున్న వివక్షకు అద్దం పడుతున్నది. 1957లో లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 4.45% కాగా, దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత 2014 నాటికి లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 12.15%కు (543 సభ్యుల సభలో 66 మంది) పెరిగింది. చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం విషయంలో 193 దేశాల జాబితాలో మన దేశం 148వ స్థానంలో ఉన్నదని చెప్పుకోవడం సిగ్గుచేటు. 18 ఆసియా దేశాలనే చూసినా ఈ విషయంలో మనది 13వ స్థానం, 8 సార్క్‌ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నాం. మన కంటే ఎంతో వెనుకబడ్డ ఆఫ్రికన్‌ దేశం రూవాండా చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం 64%, నేపాల్‌లో  29%, చివరకు ఆఫ్ఘనిస్థాన్‌లో సైతం 28% ఉండటం విశేషం. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదని భావించే పాకిస్తాన్‌ 20%తో మన కంటే ముందుండటం గమనార్హం. పాక్‌ తన జాతీయ అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది.

పాలనా స్వభావమే మార్చగల మహిళా ప్రాతినిధ్యం
జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లేకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. అన్ని స్థాయిల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మానవాభివృద్ధి సూచిక, సామాజికాభివృద్ధి మెరుగ్గా ఉన్నదని యునెస్కో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తాజా గణాంకాల ప్రకారం మానవాభివృద్ధి సూచికలో భారత్‌ 131వ స్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, తాగునీరు, పౌష్టికాహార లోపం తదితర సమస్యల పీడి తులలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ.

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం మానవ, సామాజికాభివృద్ధి పెంపొందడానికి దారి తీస్తుంది. మహిళా ప్రతినిధులున్న గ్రామాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, బాలికా విద్య, అంగన్‌వాడీలు, పొదుపు సంఘాలు, డ్వాక్రా సంస్థలు మొదలైనవి  మెరుగ్గా పనిచేస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రామీణ భారతంలో కనపడుతున్న ఈ మార్పు అన్ని స్థాయిల్లో ప్రతిఫలించాలంటే.. పరిపాలనా బాధ్యతల్లో మహిళా ప్రాతి నిధ్యాన్ని జాతీయ స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్యలను పరిష్కరించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడంలో మహిళలు మగవారికి తీసిపోరని కార్పొరేట్‌ కంపెనీల అనుభవం చెబుతోంది. బాధ్యతగా పనిచేయడంలో పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు.

రాజకీయ పార్టీల వైఖరి మారాలి
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే రాజకీయ పార్టీల వైఖ రిలో మార్పు రావాల్సిందే. ప్రధాన రాజకీయ పక్షాలు, పార్టీ కమిటీలలో, శాసనసభ, లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు 33% వాటాను అందించగలిగితే, అదే గొప్ప సామాజిక, ఆర్థిక మార్పునకు నాంది కాగలుగుతుంది. కానీ, మహిళలకు 20% పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా ఏ పార్టీ ముందుకు రావడం లేదు. 2014 ఎన్నికల్లో ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు 9% సీట్లు మాత్రమే కేటాయించాయి. ఈ పరిస్థితి మారడానికి ప్రతి రాజకీయపార్టీ మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేయాలని ఇటీవల పౌర సమాజం డిమాండు చేస్తోంది. దీన్ని చట్ట రూపంగా తేవాలంటే పార్లమెంటు ఆమోదం అవసరం. కాబట్టి  రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు నిర్దిష్ట కోటాను ప్రకటించి మహిళా సాధికారత పట్ల తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలన్నది చాలా కాలంగా మేధావులు, పౌర సమాజం చేస్తున్న సూచన.

2010లో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెచ్చి.. కాంగ్రెస్‌పార్టీని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీకి నేడు లోక్‌సభలో తగిన సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్‌పార్టీ, వామపక్ష పార్టీలు కలిసి వస్తామంటున్నాయి. మహిళా బిల్లును ఆమోదిస్తామన్న తమ ఎన్నికల హామీని నిలబెట్టుకొనే అవకాశం నేడు బీజేపీకి ఉంది.  2004లో, 2009లో, 2014 ఎన్నికల్లో బీజేపీ చెబుతూ వచ్చింది. ఆ మాటల్లోని చిత్తశుద్ధిని, నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అనువైన పరిస్థితీ ఉంది, సమయమూ ఆసన్న మైంది. మాట నిలుపుకోవాల్సినది బీజేపీ, ఆ పార్టీ ప్రధాని మోదీలే.



డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్‌ : 99890 24579

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement