ప్రముఖ కవి, విమర్శకుడు, చిత్రకారుడు, పత్రికా రచయిత, సంపాదకుడు, తొలి తెలుగు కార్టూనిస్ట్ కవి (‘శశవిషాణం’), వేదాల గురించి సృజనాత్మకంగా ఆలోచించి విస్తృతంగా రాసిన పరిశోధకుడు, ‘కన్యాశుల్కం’ నిపుణుడు, మార్క్సిస్టు మేధావి, తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొట్టమొదటి ప్రధాన అధ్యాపకుడు, రాంభట్ల కృష్ణమూర్తి. ఆయన శతజయంతి సంవత్సరమిది. పుట్టింది ఎక్కడో తూర్పు తీరంలో అయినప్పటికీ, రాంభట్లగారు తన జీవితంలో అత్యధిక భాగం గడిపింది హైదరాబాద్‌లోనే. నిజానికి, రాంభట్ల ఒక స్వయంనిర్మిత సౌధం! హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం లాంటి గ్రంథాలయాల్లోనే ఆయన తెలుగుసంస్కృత సాహిత్య అధ్యయనం సాగింది. మాతృభాష తెలుగులోనూ, స్వయంకృషితో నేర్చుకున్న ఇంగ్లిష్‌లోనూ, కొద్దోగొప్పో పాఠశాలల్లో చదువుకున్న ఉర్దూలోనూ రాంభట్లగారు తర్వాతి కాలంలో పాండిత్యం సంపాదించడం విశేషం.
తరుణ యవ్వనంలో రాంభట్ల ఆర్య సమాజ్ ప్రభావంలో వేదాల గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘అందరికీ విద్య జ్ఞానప్రాప్తి సత్యప్రకాశం’ అనే దయా నంద సరస్వతి ఆదర్శం రాంభట్లను ప్రభావితం చేసింది. చివరివరకూ ఆయన తన వృత్తి నాలుగు విషయాలు నేర్చుకోవడమూ ఆ నేర్చుకున్నదాన్ని నలుగురికి నేర్పడమేనని నమ్మి, దాన్నే ఆచరించారు. వాస్తవానికి రాంభట్ల జీవనం మేలిమలుపు తిరిగింది ఆ నవయవ్వన దశలోనే. ఆయన దయానంద సరస్వతి దగ్గరే వేద మంత్రాల ప్రతిపదార్థ తాత్పర్యాల దగ్గరే ఆగిపోలేదు! ఫ్రెడ్రిక్ రాసెన్, ఫ్రాంజ్ బాప్, రుడాల్ఫ్ ఫాన్ రాత్, ఫ్రెడ్రిక్ మ్యాక్స్ మ్యూలర్‌ల రచనలు చదవడానికి ఆయన పడరానిపాట్లు పడ్డారు. ఏమాత్రం తీరిక చిక్కినా మ్యాక్స్ మ్యూలర్ సంకలించిన ‘ద సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్’ చదువుతుండేవారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అచ్చువేసిన ఈ సంకలనం మొత్తం రాంభట్లగారికి నిత్యపారాయణీయం. కానీ, జర్మన్ ఇండాలజిస్టుల దగ్గరా ఆయన ఆగిపోలేదు. జవహర్‌లాల్ నెహ్రూ, శ్రీపద అమృత డాంగే, రాహుల్ సాంకృత్యాయన్ తదితరులు చూపిన బాటలో రుగ్వేద కాలపు గణసమాజాన్ని ఊహించే సాహసానికి ఆయన చిన్ననాటనే తెగించారు! తంత్ర సంస్కృతి గురించి సంపాదించిన పరిజ్ఞానం రాంభట్లని భౌతికవాదం వైపు నడిపించింది. ప్రాచీన ఆచారాల్లో నిబిడీకృతమయివున్న తాంత్రిక భావనలను వెతికే దిశగా అది దారితీసింది. సామెతలూ, ఊళ్ల పేర్ల వెనక దాగిన అర్థాలను విశ్లేషించడానికి ఈ భౌతికవాదమే తోవ చూపించింది. అదే ఆయన్ని తాపీ ధర్మారావు లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడికి చేరువ చేసింది. ఆ ఆలోచన క్రమమే రాంభట్లని మార్క్సిజం వైపు నడిపించింది. ఈ మేధోపరిణామమే ఆయన్ని గ్రంథస్థమయిన చరిత్ర రచనకు మించి ఆలోచించే సాహసిగా పదును పెట్టింది. అదే, తనను అరుదయిన మేధావిగా మార్చింది.
1940 దశకంలో వెలువడుతూ ఉండిన నిజాం అధికార పత్రిక ‘మీజాన్.’ ఇది, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వచ్చేది. తెలుగు పత్రికకు అడివి బాపిరాజు సంపాదకులు. ఆయన దగ్గర సహాయ సంపాదకులుగా చేసే శ్రీనివాస చక్రవర్తి సంస్కృత రూపకాల్లో దిట్ట. ఆయనకు ఆధునిక తెలుగు నాటకాల్లో ‘కన్యాశుల్కం’ అంటే తగని మక్కువ. రాంభట్లకయితే కన్యాశుల్కమంటే ప్రాణం! చక్రవర్తిగారు రాంభట్లకి ఆర్యసమాజ్ రోజులనుంచీ పరిచయస్తులు. ఆయన ద్వారానే అడివి బాపిరాజుతో రాంభట్లకు పరిచయమయింది. బాపిరాజు గారు రాంభట్లను ఎప్పుడూ ‘మైడియర్ యంగ్‌మ్యాన్!’ అని గిరీశం ఫక్కీలో పలకరించేవారట. (రాంభట్ల మమ్మల్నందర్నీ ‘ఏం ఫ్రెండూ!’ అనే పలకరించేవారు!) కన్యాశుల్కమే వారిని కట్టిపడేసింది. ఆ కన్యాశుల్కం నాటకమే రాంభట్లను అభ్యుదయ రచయితగా మార్చింది. దాని రచయిత గురజాడే సామాజిక, ప్రాంతీయ మాండలికాల పట్ల ఆయనలో ఆసక్తి కలిగించారు. గురజాడనుంచే, బాధితులపట్ల పక్షపాతం కలిగి వుండాలనే నీతిని రాంభట్ల నేర్చుకున్నారు. అదే అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక రచనలో ‘శ్రామికవర్గ పక్షపాతం’గా ప్రతిఫలించింది. ‘మృచ్ఛకటికం కన్యాశుల్కం’, ‘గిరీ శంశకారుడు’, ‘వసంతసేనమధురవాణి’ అనే అంశాలను తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం రాంభట్ల ప్రవృత్తిలోనే భాగంగా మారిపోయింది! ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరంలో చెప్పుకోవలసిన ఓ విశేషం ఉంది ఎంగెల్స్ రచన ‘ఆరి జిన్ ఆఫ్ ఫ్యామిలీ’ని రాంభట్ల వారానికి ఒకసారయినా చదివేవారు!
విభిన్న అధ్యయనరంగాల్లో విస్తృతమయిన పరిజ్ఞానం కలిగివుండి, ఏ ‘రెఫరెన్సూ’ లేకుండానే గళగ్రాహిగా మాట్లాడుతూవుండే వ్యక్తులను సంచార విజ్ఞాన సర్వస్వాలుగా పిలవడం కద్దు. అయితే, రాంభట్లని సంచార విజ్ఞాన సర్వస్వం అన డం కన్నా, నడిచే విజ్ఞాన సర్వస్వం అనడమే భావ్యమని నా నమ్మకం. ఎందుకంటే, ఆయన అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వమే! 1970–80లలో, హైదరాబాద్ పురవీథుల్లో రాం భట్ల, చిన్నపాటి శిష్యబృందాన్ని వెంటపెట్టుకుని, కిలోమీటర్ల తరబడి నడుస్తూ కనిపించేవారు. వేదవేదాంగాలు మొదలుకుని ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ వరకూ ఫ్రీ సై్టల్ లెక్చర్ దంచుతూ రాంభట్లగారు నడుస్తూవుంటే, మేమందరం ఆయన వెంట అబ్బురపడుతూ నడిచిపోతూండేవాళ్లం. సరమఅపాల మొదలుకుని గిల్గ మేష్‌ఎంకిడు వరకూ ఎందరెందరి ప్రస్తావనో వస్తూవుండేది. కాస్త ఖాళీగా వుండే ఇరానీ రెస్టారెంట్ కనిపించే వరకూ ఈ వాకథాన్ సాగుతూ వుండేది. ఎక్కడయినా ‘అడ్డా బిఠాయించామంటే’ చర్చనీయాంశం ఓ కొలిక్కివచ్చే వరకూ ‘బైఠక్’ కొనసాగాల్సిందే! ఈ చర్చ ఎప్పుడూ వన్‌వే ట్రాఫిక్‌లా జరిగేదికాదు. నిజానికి రాంభట్లగారే
అలా జరగనిచ్చేవారు కారు. ఒకవేళ అలా జరిగే ప్రమాదం కనబడితే, అప్పటిదాకా తాను చెప్తూవచ్చిన వాదాన్ని తానే ఖండించడం మొదలుపెట్టేవారాయన! ‘వాదానువాద సంవాద ప్రతివాదా’లనే తర్క ప్రక్రియల గురించి సహచరులకు వివరిస్తూ చర్చను మోడరేట్ చేసేవారాయన. ఆయన పాతకాలపు ‘చండామార్కుల మార్కు’ గురువు కారు. తన కన్నా పాతిక ముప్ఫైయేళ్లు చిన్నవారయిన శిష్యులందరినీ ప్రేమగా ‘ఫ్రెండూ!’ అని పిలిచే ఆధునిక గురువు. ఏథెన్స్ వీథుల్లో సోక్రటిస్ నిర్వహించాడని చెప్పే ‘ఎలింకస్’ తరహా సంచార చర్చాగోష్ఠులను రాంభట్ల ఏళ్ల తరబడి కొనసాగించారు. నాకు తెలిసి, తెలుగునాట ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మరో వ్యక్తి లేరు! అదీ రాంభట్ల విశిష్టత. శతజయంతి వేళ మనం స్మరించుకోవలసిన ముఖ్యమైన అంశం ఇదే. రాంభట్లగారు రాసింది బహుతక్కువ. ఆ రాసిన పది పుస్తకాలూ కూడా మార్కెట్‌లో దొరకడం లేదు. ఈ శతజయంతి సందర్భంగానైనా తన లభ్య రచనల సర్వస్వం వెలువడితే బావుంటుంది. రాంభట్లగారి ‘ఫ్రెండ్స్’ వింటున్నారా?
(ఫిబ్రవరి 22 ఉదయం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సభ సందర్భంగా..)
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
మందలపర్తి కిశోర్
అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వం రాంభట్ల!
Published Thu, Feb 20 2020 4:42 AM | Last Updated on Thu, Feb 20 2020 4:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment