దమ్ముంటే బాబును అరెస్ట్ చేయాలి
ఏసీబీకి జీవన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏసీబీకి దమ్ముంటే ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని టీసీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందానికి ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో కుట్రదారుడైన చంద్రబాబుపై తెలంగాణ ఏసీబీ ఎందుకు విచారణ జరపడం లేదని పేర్కొన్నారు. కేసును ఏసీబీ అధికారులు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేవలం కొందరు చిన్న పాత్రధారులను అరెస్ట్ చేయడంలో ఆంతర్యమేమిటన్నారు.