బాబు డ్రైవర్ల నెంబర్లతో ఎమ్మెల్యేలకు ఫోన్!
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో వెలుగుచూస్తున్న వివరాలతో ఏసీబీ అధికారులు విస్తుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీరి ఫోన్ నెంబర్లతో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. రికార్డయిన కాల్ డేటా ఆధారంగా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. బుధవారం చంద్రబాబు ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులు, ఆయన ఇంటి సమీపంలో విచారించారు. చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ వద్ద పనిచేస్తున్న భద్రత సిబ్బంది, వారి ఫోన్ నెంబర్లపైనా ఆరా తీశారు. వచ్చిపోయే కార్ల నెంబర్లను సేకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు హడావుడి చేసినట్టు సమాచారం.