చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే | Chandra babu should resign now, demands alla ramakrishna reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే

Published Mon, Aug 29 2016 12:52 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే - Sakshi

చంద్రబాబు తప్పు ఒప్పుకొని దిగిపోవాలి: ఆర్కే

అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో చంద్రబాబు, వీడియో సాక్ష్యాలతో ఆయన మనుషులు కూడా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారని ఆయన చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన తర్వాత దీనిపై పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులోని సంభాషణలతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు సందర్భాల్లో మాట్లాడిన ఆడియో టేపులను తీసుకుని వాటికి దేశ విదేశాల్లోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించానని ఆయన చెప్పారు. ఆయా ల్యాబ్‌లు ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకుని ఈనెల 8వ తేదీన ఏసీబీ కోర్టును ఆశ్రయించానన్నారు. దీనిపై రెండుమూడు సార్లు వాదనలు విన్న న్యాయమూర్తి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఈ కేసులో ముద్దాయిగా చేర్చారా లేదా అని తాము అడిగామన్నారు. అప్పట్లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలలో అవసరం లేకపోయినా కూడా తన అక్రమ సంపాదనతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆర్కే అన్నారు.

ఈ విషయం బయటపడిన తర్వాత మొదట్లో తనకూ ఏసీబీ ఉందని, తనకూ హైదరాబాద్‌లో పోలీసులు ఉన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బెదిరించారని, ఆ తర్వాత మాత్రం కేసు నుంచి బయట పడేందుకు తర్వాత కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి పదేళ్ల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నా, ఈయన మాత్రం హడావుడిగా లేని రాజధానికి పారిపోయారని, ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. ఇన్ని తప్పులు చేస్తున్నా పెద్ద మనిషిగా, ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చట్టం మీద, న్యాయవ్యవస్థ మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలి తప్ప అప్పీలుకు వెళ్లకూడదని చెప్పారు. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా ఈ కేసులో న్యాయం జరుగుతుందనే తాము ఆశిస్తున్నామన్నారు.

ఓటుకు కోట్లు కేసులో నిస్సిగ్గుగా దొరికిపోయిన చంద్రబాబును ఇన్నాళ్ల వరకు ముద్దాయిగా చేర్చలేదన్న విషయాన్ని తాము ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చామని ఈ కేసులో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఇన్నాళ్లుగా సరైన విచారణ జరగలేదని ఆయన అన్నారు. చంద్రబాబు నూటికి నూరుపాళ్లు ముద్దాయి అని ప్రతి ఆత్మ ఘోషించినా, సంవత్సరం నాలుగు నెలల పాటు ఆయనను ముద్దాయిగా చేయలేకపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు ముద్దాయి అనడానికి వీలున్న ప్రతి అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement