ఎంతో రుచిరా.. ఇదేమి రుచిరా? | citizens tastes krisha, godhavari water differently | Sakshi
Sakshi News home page

ఎంతో రుచిరా.. ఇదేమి రుచిరా?

Published Thu, Feb 25 2016 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

ఎంతో రుచిరా.. ఇదేమి రుచిరా?

ఎంతో రుచిరా.. ఇదేమి రుచిరా?

కృష్ణా, గోదావరి నదుల నీటి రుచిలో తేడాలు ఉన్నాయంటున్న నగర వాసులు.. రెండింటి నీటిపై ప్రయోగశాలలో పరీక్ష

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం దాహార్తిని తీర్చుతున్నది కృష్ణా, గోదావరి నదులే. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు తరలివస్తున్న ఆ నదుల నీరే ఇక్కడి ప్రజలకు ఆధారం. కానీ ఈ రెండు నదుల నీటి రుచిలో చాలా తేడా ఉంటోందని నగరవాసులు అంటున్నారు. కృష్ణా నీళ్లు సరఫరా అవుతున్న కొన్ని ప్రాంతాల వారికి కొంతకాలంగా గోదావరి నీళ్లు సరఫరా చేస్తుండడంతో ఈ తేడాను గుర్తించినట్లు చెబుతున్నారు. గోదావరి జలాలు రుచిలో కఠినంగా ఉంటున్నాయని, కృష్ణా నది జలాలు మృదువుగా అనిపిస్తున్నాయని అంటున్నారు. రోజూ కృష్ణా మూడు దశల పథకాల నుంచి 260 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నది నుంచి 86 మిలియన్ గ్యాలన్ల నీటిని జల మండలి సేకరించి హైదరాబాద్ నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది. ఈ నీటి రుచిలో తేడాలుంటున్నాయని నగరవాసులు పేర్కొంటున్న నేపథ్యంలో... కృష్ణా, గోదావరి జలాలను ‘సాక్షి’ బృందం సేకరించి ఐఎస్‌వో 9001:2008 గుర్తింపు పొందిన శ్రీమహీంద్ర ప్రయోగశాల(చైతన్యపురి)లో పరీక్షించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

 గోదావరి ‘గాఢత’ అధికమే..!
 కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి 186 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు తరలిస్తున్న గోదావరి జలాల గాఢత కాస్త అధికంగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా ‘ఐఎస్ 10500-2012’ ప్రమాణాల ప్రకారం లీటరు నీటి గాఢత 6.5 పీహెచ్‌కు మించరాదు. కానీ గోదావరి జలాల గాఢత 7.28 పీహెచ్‌గా నమోదైంది. ఇక నీటి కాఠిన్యత లీటరు నీటిలో 200 మిల్లీగ్రాములకు మించరాదు. కానీ కొద్దిగా ఎక్కువగా 202 మిల్లీగ్రాములుగా నమోదైంది. నీటిలో కరిగిన మట్టి, ఇసుక రేణువులు 200 మిల్లీగ్రాములకు మించరాదు.. కానీ 256 మిల్లీగ్రాములున్నట్లు తేలింది. లీటర్ నీటిలో సోడియం 38.42 మిల్లీగ్రాములు ఉంది. దీంతో ఈ నీరు తాగినపుడు రుచి కొంత కఠినంగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. గోదావరి జలాలను శుద్ధిచేసేందుకు కొండపాక నీటిశుద్ధి కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో ఫిల్టర్‌బెడ్స్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ నీటి గాఢత కొంత అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నీటివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ ఉండవని... కాచి చల్లార్చి, వడబోసి తాగితే సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు.

 కృష్ణా నీళ్లు మృదువుగా..
 నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగ్య నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ముందుగా నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు నీటిని చేర్చుతున్నారు. అక్కడి నుంచి మెయిన్ పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటి గాఢత 6.25 పీహెచ్‌గా, కాఠిన్యత ప్రతి లీటరు నీటిలో 180 మిల్లీగ్రాములుగా నమోదైంది. దీంతో ఈ నీరు తాగడానికి మృదువుగా,తేలికగా, రుచిగా ఉన్నట్లు వాటిని వినియోగిస్తున్నవారు చెబుతున్నారు. ఇక ఈ నీటిలో కరిగిన మట్టి, ఇసుక రేణువులు కూడా ప్రమాణాల మేరకే ఉన్నాయి.

 ఫిల్టర్ చేసుకొని తాగాలి..
 ‘‘నీటిలో కరిగే పలు పదార్థాలు, గాఢత, ఇతర లవణాలు అధికంగా ఉంటే రుచి మారుతుంది. తాగినపుడు నీళ్లు మందంగా అనిపిస్తాయి. అందువల్ల నల్లా నీటిని కాచి, చల్లార్చి, వడబోసుకోవడం లేదా ఫిల్టర్ చేసుకొని తాగితే జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా నశిస్తుంది. నేరుగా తాగితే డయేరియా, జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు..’’
 - డాక్టర్ బి.రవిశంకర్,
 గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

 కృష్ణా, గోదావరి నీటిని పరీక్షించగా వచ్చిన ఫలితాలు..
 పరీక్ష        పరిమితి                  కృష్ణా నీరు         గోదావరి నీరు
 గాఢత       6.50 పీహెచ్            6.25 పీహెచ్          7.28 పీహెచ్
 కాఠిన్యత     200 మిల్లీగ్రాములు    180 మిల్లీగ్రాములు    202 మిల్లీగ్రాములు
 సోడియం     ఉండరాదు                లేదు                     38.42 మిల్లీగ్రాములు
 సిలికా        ఉండరాదు                     లేదు                      5.48 మిల్లీగ్రాములు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement