అందుకే నాలుగుసార్లు మునుగుతున్నారు
రాహుల్‌పై కవిత విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏకు దగ్గరయ్యేందుకే టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకులే ఒకటికి నాలుగుసార్లు గోదావరిలో మునుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ కవితకు రాహుల్‌గాంధీని విమర్శించేస్థాయి లేదని అన్నారు.
కొన్నిరోజులు ఆగితే ఎవరు పాపాలు చేశారో తెలుస్తుందని, అప్పుడు గోదావరిలో మునిగి పాపాలు కడుక్కోవాలని టీసీఎల్‌పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. పాపాలు పోగొట్టుకోవడానికి రాహుల్ పుష్కర స్నానం చేయాలన్న కవిత వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ధన్యవాదాలు చెప్పినపుడు కాంగ్రెస్ పాపాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజనకు రాహుల్‌గాంధీయే కారణమంటూ ఆంధ్రప్రాంత నాయకులు విమర్శలు చేస్తుంటే.. ఇక్కడ కవిత కూడా ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని, అసలు ఆమె తెలంగాణవాదేనా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. అసలు ఆమె ఏమీ మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. రైతు ఆత్మహత్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు కేబినెట్‌లో కొనసాగే అర్హత లేదని మండలిలో కాంగ్రెస్ ఉప నాయకుడు పొంగులేటి సుధాకరరెడ్డి మండిపడ్డారు.