సాక్షి, హైదరాబాద్: ‘మేం చెప్పే వరకు ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు గురువారం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యూషకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న అవేర్ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను, సిబ్బందిని హైకోర్టు అభినందించింది. ఆమె సంరక్షణ విషయాలను చర్చించేందుకు ఆమె పెద్దనాన్న కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్‌కు సూచించింది.
అన్ని కోణాల్లో పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాతే ఆ యువతి భవిష్యత్తు గురించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై చలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు లేఖ రాశారు.
దీనిని సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారించాలని కోరారు. దీనికి అంగీకరించిన జస్టిస్ బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై నివేదికను స్పెషల్ జీపీ శరత్‌కుమార్ ధర్మాసనం ముందుంచారు.
ప్రత్యూష తండ్రి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, శరీరంపై ఉన్న గాయాలు మానుతున్నాయని తెలిపారు. అవేర్ ఆసుపత్రి ఉచితంగా చికిత్సను అందిస్తోందని, రెండు, మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయవచ్చని డాక్టర్లు తెలిపారని ఆయన వివరించారు. ప్రత్యూష వద్దకు ఆమె పెద్దమ్మ, పెద్దనాన్న వచ్చి వెళ్లారని శరత్‌కుమార్ చెప్పడంతో, అయితే ఆమె పెద్దనాన్నను శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ధర్మాసనం ఆదేశించింది.
మేం చెప్పే వరకు ఆసుపత్రిలోనే ప్రత్యూష
Published Fri, Jul 17 2015 1:46 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement