ధర్మారం (డిచ్‌పల్లి) : సంక్రాంతి భోగి మంటలు ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం తెచ్చిపెట్టాయి. భోగి మంటల్లో వేసిన దోమల మందు స్ప్రేయర్ 'హిట్' ట్యూబ్ పగలటంతో చిన్నారితోపాటు ముగ్గురు గాయాలపాలయ్యారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన రాకోలు సాయి, రమాదేవి దంపతులు తమ కుమారుడు రితేష్(3), వారి బంధువు శివకృష్ణతోపాటు గురువారం ఉదయం ఇంటి ముందు భోగి మంట వేసి అందులో పాత వస్తువులను పడవేసి అక్కడే కూర్చున్నారు.
వాటిలో దోమలు, బొద్దింకలను చంపడానికి వాడే 'హిట్' స్ప్రేయర్ కూడా ఉంది. మంటల వేడికి బాటిల్ పేలి దాంట్లో మిగిలి ఉన్న మందు ఎగజిమ్మి అందరి ముఖాలు, చేతులపై పడింది. స్ప్రేతో పాటు మంటలు అంటుకున్నాయి. కుటుంబసభ్యులు వారిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలైన బాలుడు రితేశ్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
భోగి మంటల్లో పేలిన 'హిట్' స్ప్రేయర్
Published Thu, Jan 14 2016 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement