
పరిశ్రమల అవసరాలపై టాస్క్‌ఫోర్స్
* సాంకేతిక విద్యాసంస్థలపై అధ్యయనం
* మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన మానవ వనరులు అందించడంలో విద్యా సంస్థలు, పరిశ్రమల నడుమ అంతరాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా సంస్థల్లో ప్రస్తుతమున్న సాంకేతిక విద్యా విధానంపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. పనిలో పనిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పత్తి రంగాలకు అవసరమైన మానవ వనరుల అవసరాలపై కూడా దృష్టి సారించనుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐఐ, ఫిక్కీ, ఫ్టాప్సీ తదితర పారిశ్రామిక సంఘాలతో పాటు, టీ సీఎస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా అండ్ మహీంద్ర, హైసియా తదితర ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా వుంటారు. జేఎన్‌టీయూ మాజీ వైస్ చాన్స్‌లర్లు రామేశ్వర్‌రావు, డీఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ జయప్రకాశ్‌రావు, సాంకేతిక విద్య, పరిశ్రమల శాఖ కమిషనర్ తదితరులు టాస్క్‌ఫోర్సులో సభ్యులుగా నియమితులయ్యారు. మూడు నెలల్లోగా టాస్క్‌ఫోర్స్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో నిర్దేశించారు.
మానవ వనరుల కొరత తీర్చేందుకే
ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్)లో భాగంగా పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాము మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నామని పెట్టుబడిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గణనీయంగా వృత్తి విద్యా కాలేజీలున్నా ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా సంస్థలు, పరిశ్రమల నడుమ అంతరాన్ని తొలగించడం లక్ష్యంగా ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ సాయంపై ఆధార పడి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న వృత్తి విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం, పారిశ్రామిక వాడలు, పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా ఈ సంస్థల్లో శిక్షణ ఇవ్వడం తదితర అంశాల అధ్యయనంపై టాస్క్‌ఫోర్స్ దృష్టి సారిస్తుంది. వృత్తి విద్యా కోర్సులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై అధ్యయనం చేస్తుంది.