మనిషిని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాలు, మత్తును కలిగించే అనస్థీషియా మందులు కల్లులో కలిపి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.
మాదక ద్రవ్యాల మాఫియా పనిగా అనుమానం
సాక్షి, హైదరాబాద్: మనిషిని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాలు, మత్తును కలిగించే అనస్థీషియా మందులు కల్లులో కలిపి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఇప్పటివరకు కల్లులో అల్ఫజొలం, డైజోఫాం వంటి మందులు మాత్రమే కలిపి విక్రయిస్తున్నట్లు భావించినా, అంతకన్నా ఎక్కువ మోతాదులో మత్తును కలిగించే మాదక ద్రవ్యాలను కల్లులో క లుపుతున్నారని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అనుమానిస్తోంది.
హైదరాబాద్ నుంచి మాల్దీవులకు విమానాల ద్వారా మాద క ద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న మాఫియానే కల్లు దుకాణాలకు కూడా హాని కలిగించే మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేసింది. డీసీఏ వాదనతో ఏకీభవించిన ఎక్సైజ్ శాఖ కూడా రాష్ట్రంలో కల్లు కల్తీ అవుతుందని తేల్చింది. కల్తీ కల్లును అరికట్టేందుకు, ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు కల్లు దుకాణాలకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది.
ఆబ్కారీ భవన్‌లో బుధవారం ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, డీసీఏ డెరైక్టర్ అకున్ సబర్వాల్, నార్కోటిక్స్ డీఐజీ వేణుగోపాల్, ఏపీ ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ దామోదర్, తెలంగాణ ఎక్సైజ్ అదనపు కమిషనర్ టి. ప్రసాద్, పలువురు డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు సమావేశమయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రధానంగా కల్లులో ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలిందని సమావేశంలో తేల్చారు.