స్తంభించిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఆయా ఆస్పత్రుల్లో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, సిబ్బందిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి తీసుకోవాలని, కనీస వేతనంతో పాటు జీవిత బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీ ఆరోగ్య మిత్ర, నెట్‌వర్క్ ఆస్పత్రి మిత్ర, టీమ్ లీడర్స్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
నిలిచిన సేవలు
ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల్లో కీలకమైన నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి, యశోద, కిమ్స్, సన్‌షైన్, కేర్, అపోలో తదితర ఆస్పత్రుల్లో సేవలు స్తంభించిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, గుండెపోటు బాధితులకు ఉచిత వైద్య సేవలకు ఆస్పత్రులు నిరాకరించడంతో వారికి నరకయాతన తప్పలేదు.
ఆరోగ్యశ్రీలో సమ్మె ప్రభావం లేదు
ఆరోగ్యశ్రీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె ప్రభావం సంస్థపై లేదని ఆరోగ్యశ్రీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిరంతరాయంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగులు సమ్మెను కొనసాగించినప్పటకీ ఎలాంటి అంతరాయం ఏర్పడదన్నారు. సమ్మె జరిగినప్పటికీ శనివారం రాష్ట్రంలో 421 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. 296 మంది ఇన్ పేషెంట్లుగా చేరారన్నారు.