సమ్మె బాటలో ‘108’ ఉద్యోగులు
- నేడు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని నిర్ణయం
- వచ్చే నెల మొదటి వారంలో విధుల బహిష్కరణకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు అత్యవసర వైద్యసేవలు అందించే ‘108’ సిబ్బంది సమ్మె బాట పట్టనున్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయాలని వారు నిర్ణయించారు.ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌లకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు అశోక్ తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే.. వచ్చే నెల మొదటివారంలో విధులను బహిష్కరిస్తామని చెప్పారు.
వేతనాలే ప్రధాన సమస్య..
రాష్ట్రంలో ‘108’ అత్యవసర వైద్య సేవల పథకం కింద 316 అంబులెన్స్ వాహనాలు సేవలు అందిస్తున్నాయి. వీటికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండగా.. నిర్వహణ బాధ్యతను జీవీకేకు చెందిన ‘అత్యవసర సేవల నిర్వహణ, పరిశోధన సంస్థ (ఈఎంఆర్‌ఐ)’ పర్యవేక్షిస్తోంది. ‘108’ సేవల కోసం దాదాపు 1,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఉద్యోగుల సంక్షేమ సంఘం చెబుతోంది. అందులో డ్రైవర్లు, కాల్ సెంటర్ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, ఇతరత్రా సహాయకులు ఉన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ.
ఇందులో మొదటి నుంచీ పనిచేస్తున్న వారికి కూడా ఇప్పటికీ రూ.10 వేలకు మించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈఎంఆర్‌ఐపైనా వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, ఉద్యోగుల కొరత అధికంగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో అనేకచోట్ల ‘108’ సేవలు సంతృప్తికరంగా సాగడంలేదని పేర్కొంటున్నారు. దీనికితోడు పని ఒత్తిడి మూలంగా కొన్ని సందర్భాల్లో సర్వీసులు సరిగా పనిచేయడం లేదంటున్నారు. మొత్తంగా కార్మిక చట్టాలను అమలు చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందంటూ ఉద్యోగులు పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అయినా సరైన స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. రెండు వారాల ముందే సమ్మె నోటీసు ఇస్తున్నందున ప్రభుత్వం ఈలోపు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని అశోక్ పేర్కొన్నారు. సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాక ఈఎంఆర్‌ఐకి కూడా దాన్ని పంపిస్తామని ఆయన చెప్పారు.