‘టెరీ’ చీఫ్‌గా ఆర్‌కే పచౌరీ తొలగింపు
బెంగళూరు: మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టెరీ(ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీ ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. బెంగళూరులో గురువారం టెరీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెరీ నూతన చీఫ్‌గా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్‌ను నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మాథుర్ త్వరలోనే బాధ్యతలు చేపడతారని టెరీ ఒక ప్రకటనలో తెలిపింది.
లైంగిక వేధింపుల ఆరోపణలపై టెరీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై కోర్టు స్టే అమలులో ఉందని పేర్కొంది. పర్యావరణ పరిశోధన సంస్థ అయిన టెరీ వ్యవస్థాపకుడిగా ప్రపంచ పర్యావరణవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతినొందిన 74 ఏళ్ల పచౌరీ ఒక సీనియర్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అపఖ్యాతిపాలయిన సంగతి తెలిసిందే.