వారి దృష్టంతా కమీషన్లు, కాంట్రాక్టులపైనే..
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి హరీశ్‌రావు విసుర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లు చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా నీళ్లిచ్చే ఉద్దేశంతో చేపట్టలేదని, కమీషన్లు, కాంట్రాక్టులకు ప్రాధాన్యం ఇచ్చారని భారీ నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ ఆలోచించి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు హరీశ్‌రావు సమక్షంలో సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కృష్ణానదిపై పూర్తి హక్కులదారులమైనందునే సీఎం ఆలోచించి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తీసుకుని పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 1.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది అడ్డుపడినా పాలమూరు పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల పని అయిపోయిందని, కాంగ్రెస్ ఢిల్లీలో మునిగింది, గల్లీలో మునిగింది, అది మునిగిపోయిన పడవ అని వ్యాఖ్యానించారు.
కొడంగల్ ప్రజలు తలవంచుకునేలా స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరించారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రులు జూపల్లి, డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ కోసమే తాము పార్టీలో చేరుతున్నామని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మల్లిక్‌రెడ్డి పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.