డెక్కన్ కెమికల్స్ వద్ద ఉద్రిక్తత
పాయకరావుపేట: ఫ్యాక్టరీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని.. వెంటనే భద్రతా చర్యలు తీసుకోకుంటే మూసివేయిస్తామని హెచ్చరిస్తూ ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలివీ...విశాఖ జిల్లా పాయకరావుపేట వద్ద పట్టణ సమీపంలో డెక్కన్ కెమికల్స్ ఫ్యాక్టరీ ఉంది. దీనిలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
దీంతో ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేతవరం, రాజానగరం, గజపతి నగరం, వెంకటనగరం, రాజవరం గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రజలు కర్మాగారం ప్రధాన గేట్ వద్ద బైఠాయించారు. ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీ వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీలోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.