అశోక్‌బాబు స్పందించరేం?
అశోక్‌బాబు స్పందించరేం?
Published Sun, Jul 12 2015 8:26 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
తిరుపతి రూరల్: మహిళా అధికారులపై దాడులు జరుగుతున్నా ఎపీఎన్జీవో నాయకుడు ఆశోక్‌బాబు..ఎందుకు మౌనంగా ఉంటున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పచ్చనేతల మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యాపారాలు, రాష్ర్టస్థాయి పరపతి కోసమే పదవులను అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. అధికారులపై దాడులను ఖండించలేని అశోక్‌బాబు నాయకుడుగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీ, గుండా రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళితే అధికార పార్టీకి చెం దిన అక్రమార్కుల చేతిలో దెబ్బలు తినే పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.
చిన్నగొట్టిగల్లు తహశీల్దార్‌పై దాడి అమానుషం
చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లులో చెరువు కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా తహశీల్దార్‌పై టీడీపీ సర్పంచ్ దాడికి పాల్పడడం అమానుషమని చెవిరెడ్డి అన్నారు. కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
Advertisement