నేనున్నానని..
సాక్షిప్రతినిధి, అనంతపురం:
మూడేళ్లుగా వరుస కరువులు... రుణమాఫీపై పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. అరకొరగా చిల్లర విదిల్చి చేతులు దులుపుకుంది. కొంతమంది రైతులకు అదీ లేదు. షరతులతో కూడిన రుణమాఫీ రైతులకు శరాఘాతంగా పరిణమించింది. బకాయిలు చెల్లించాలని ఓ వైపు బ్యాంకు నుంచి నోటీసులు.. మరోవైపు ప్రైవేటు వడ్డీవ్యాపారుల ఒత్తిళ్లు.. వెరసి 'అనంత' రైతులు తీవ్ర వేదన పడ్డారు. ఓ వైపు ప్రభుత్వం చేసిన మోసాన్ని భరించలేక... బ్యాంకులు, వడ్డీవ్యాపారుల ఒత్తిళ్లు భరించలేక... ఆత్మాభిమానం చంపుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 83 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అన్నదాతల పరిస్థితి ఎంతభయంకరంగా ఉంటో ఇట్టే తెలుస్తుంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చి 'అనంత'రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి మూడో విడత రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు.
'అనంత' రైతులు ఏటా నష్టపోతూనే ఉంటారు. ఈ క్రమంలో బాధ్యత గల ప్రభుత్వాలు రైతులకు దన్నుగా నిలవాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒడ్డుకు చేర్చాలి. అయితే చంద్రబాబు ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. వారికి మరింత ఇబ్బందులు కల్పించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. గద్దెనెక్కిన తర్వాత సాకులు చెప్పి షరతులతో కూడా రుణమాఫీ అంటూ దగా చేశారు.
'అనంత' రైతులకు కోలుకోలేని దెబ్బ:
జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817కోట్ల రుణాలు బకాయిలున్నాయి. సర్కారు చెప్పినట్లు పంటరుణాలు, బంగారు రుణాలు మాఫీ చేయాలన్నా 8.20లక్షల ఖాతాల్లో రూ.4,994కోట్ల మాఫీ చేయాలి. అయితే ప్రభుత్వం మాత్రం 6.62 లక్షల ఖాతాల్లో రూ.2,234.5 కోట్ల మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందులో తొలి విడతలో రూ.780.16కోట్ల మాత్రమే విడుదల చేసింది. దీంతో పాటు 2013-14కు సంబంధించి రావాల్సిన రూ.643కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీని ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ ఏడాదికి సంబంధించి 574 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు చేయాలి. ఈ క్రమంలో కళ్లెదుట కొండలా కన్పిస్తోన్న అప్పులు తీర్చడం కష్టసాధ్యమవుతుందని గ్రహించి ఆత్మహత్యలకు తెగించారు. ఏడాదిలోనే జిల్లాలో 83మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే 'అనంత' రైతులు ఎంత వేధన చెందారో ఇట్టే తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని నిద్రలేపే దిశగా:
ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను స్వయంగా వచ్చి పరామర్శిస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. జగన్ ప్రకటనతో ప్రభుత్వం హడావిడిగా స్పందించింది. ఫిబ్రవరి 22 నుంచి రైతుభరోసాయాత్ర ఉన్న నేపథ్యంలో 'అనంత'లో 30మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫిబ్రవరి 21న ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. జాబితా ప్రకటనలో కూడా చిత్తశుద్ధి చూపలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులందరినీ గుర్తించలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22-26వరకూ తొలి విడత భరోసా యాత్రను జగన్ చేపట్టారు. 5రోజులపాటు 781 కిలోమీటర్లు ప్రయాణించి 11మంది రైతుల కుటుంబాలను పరామర్శించారు. రెండోవిడతలో మే 11-18 వరకూ 1150కిలోమీటర్లు ప్రయాణించి 14కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలో మూడో విడతయాత్రను నేటి నుంచి చేపట్టనున్నారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించనున్నారు.
తొలిరోజు పర్యటన ఇలా..:
జగన్‌మోహన్‌రెడ్డి నేడు బెంగళూరు నుంచి శెట్టూరుకు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత కైరేవు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న పెద్దనాగప్ప అనే రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు.