
సాక్షి, హైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో తాజా దర్యాప్తునకు ఆదేశించాలని, దర్యాప్తు తీరును స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆయేషా మీరా హత్య కేసులో తాజాగా దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఆదేశించింది. దర్యాప్తును తాము స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది. ‘సిట్’ సభ్యులను తమ అనుమతి లేకుండా మార్చడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.
దర్యాప్తు నిమిత్తం సిట్‌కు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని వెల్లడించింది. కేసు దర్యాప్తు సందర్భంగా బయటి నుంచి ఏవైనా ఒత్తిళ్లు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సిట్‌కు సూచించింది. దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని, ఎప్పటికప్పుడు తమకు నివేదికలు అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. అందులో భాగంగా ఏప్రిల్ 20 నాటికి ఓ నివేదికను సమర్పించాలని తెలిపింది. గతంలో ఈ కేసులో అసలైన నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇందుకు బాధ్యులైన అధికారులపై అపెక్స్ కమిటీ ద్వారా చట్ట ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment