వందేళ్ల వైభవం | 100 years in hyderabad City | Sakshi
Sakshi News home page

వందేళ్ల వైభవం

Published Fri, Dec 13 2013 3:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వందేళ్ల వైభవం - Sakshi

వందేళ్ల వైభవం

=నాటి టౌన్‌హాలే.. నేటి అసెంబ్లీ
 =భవనం నిర్మించి నేటికి వందేళ్లు
 =దీని సాక్షిగా ఎన్నో చర్చలు, శాసనాలు

 
అద్భుత నిర్మాణశైలి.. మిలమిలలాడే శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న ఈ భవనాన్ని గుర్తుపట్టారా?. నాడు మహబూబియా టౌన్‌హాలుగా ఒక వెలుగు వెలిగిన ఈ భవనం కాలక్రమంలో శాసనసభ భవనంగా మారింది. టౌన్‌హాలుగా వ్యవహరించిన కాలంలో తీసిన మొట్టమొదటి చిత్రమిది. ప్రస్తుతం భవనాన్ని నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం...
 
అది 1904వ సంవత్సరం. ఆరోజు హైదరాబాద్ అంతా సందడిగా ఉంది. ఉదయం నుంచి ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న నగరవాసులు తండో పతండాలుగా ఒక ప్రదేశానికి చేరుకున్నారు. నగర ప్రముఖులు, మంత్రులు, ప్రతినిధులు అందరూ నిరీక్షిస్తున్నారు. నగరంలోని అన్నివర్గాల ప్రజల ప్రేమాభిమానాలకు పాత్రుడైన ఆయన ఏం చెబుతాడోననేది ఉత్కంఠ. సాయంత్రం ఐదున్నర సమయంలో ఆరో నిజాంనవాబు మీర్‌మహబూబ్ అలీఖాన్ సభాస్థలికి చేరుకున్నారు.

ఆయన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ప్రసంగించారు. దేశంలోని వివిధ సంస్థానాదీశులతో జరిగిన ఢిల్లీదర్బార్ కార్యక్రమంలో పాల్గొని నగరానికి చేరుకున్న మహబూబ్‌కు సాదరస్వాగతం పలికేందుకు చేసిన వేదిక అది. ఆవేదిక పైనుంచే ఆయన మాట్లాడారు. హైదరాబాద్ రాజ్యంలో తాను చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో చేయదల్చిన పనులను చెప్పారు. ఆ క్షణంలోనే నగరవాసులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిజాం నవాబు ఢిల్లీ దర్భార్ సభల్లో పాల్గొని వచ్చిన ఆ చారిత్రక సందర్భం చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన  భవనాన్ని కట్టించాలని తీర్మానించారు. ఆకట్టడం కోసం అన్నివర్గాల ప్రజలు పరిశ్రమించారు. చందాలు పోగుచేశారు.

మరోఏడాది తర్వాత  అంటే 1905లో మహబూబ్‌అలీఖాన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా ఆ అందమైన భవన నిర్మాణం ప్రారంభంకాగా..1913లో పూర్తయ్యింది. కానీ మహబూబ్‌అలీఖాన్ 1911లోనే చనిపోయారు. ఆయన తనయుడు ఏడోనిజాం మీర్‌ఉస్మాన్‌అలీఖాన్ హయాంలో ఆభవనం పూర్తయ్యింది. మిలమిలలాడే తెలుపు వర్ణంలో నింగినంటేలా వెలిసిన ఆశ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్ధం మహబూబియా టౌన్‌హాల్‌గా నామకరణం చేశారు. ఆ టౌన్‌హాలే ఆతర్వాత రాష్ట్ర శాసనసభ అయ్యింది. 1913 డిసెంబర్ నుంచి వినియోగంలోకి వచ్చిన అద్భుతమైన టౌన్‌హాల్‌కు ఇప్పుడు నూరేళ్లు. ఆసందర్భంగా ప్రత్యేక కథనం ఇది.     
 
అద్భుతమైన నిర్మాణ శైలి: నాటి నుంచి నేటివరకు ఎందరెందరో రాజనీతిజ్ఞులు, మరెందరో పరిపాలనా దురంధురులు, విధానరూపకర్తలు, ప్రజ సమస్యలపై ఎలుగెత్తిన రాజకీయ నాయకులు, ప్రజాజీవితంలో తలపండిన నేతలు ఆ భవనంలో కొలువుదీరారు. శాసనాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చర్చోపర్చలు జరిగాయి. ఆనాటి నిజాంకాలంలో హైదరాబాద్ సంస్థానప్రముఖులు, ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకొన్నారు. సంస్థాన విలీనానంతరం కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం శాసనాలను రూపొందించాయి.

ఈ శతాబ్ద కాలంలో అనేక కీలకమైన ఘట్టాలకు,సంక్లిష్టమైన సందర్భాలకు వేదికగా నిలిచిన ఒకప్పటి టౌన్‌హాల్, ఇప్పటి అసెంబ్లీ భవనం వైవిధ్యభరిమైన  సంస్కృతుల కలయిక. విభిన్న శైలులను సంతరించుకొని వెలసిన నిలువెత్తు హిమవన్నగం. ఉట్టిపడే రాజసానికి ప్రతీక. అందమైనగోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్‌లు, భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్లు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి.

కుత్‌బ్‌షాహీ,ఆసిఫ్‌జాహీల కాలంలో కట్టించిన అనేక చారిత్రక భవనాల కంటే కూడా అత్యాధునిక నిర్మాణ శైలిని సంతరించుకొన్న టౌన్‌హాల్ ఇప్పటికీ దేశవిదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి,రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని నిర్మించారు. ఆరోనిజాం కాలంనాటి అధికారిక భవన నిర్మాణ నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది రూపుదిద్దుకుంది. టౌన్‌హాల్ నిర్మాణం  కోసం రాజస్థాన్‌లోని  మఖ్రానా నుంచి  రాళ్లను తెప్పించారు. రెండొంతుస్థులతో నిర్మించిన టౌన్‌హాల్ మొత్తంగా ఒక సువిశాలమైనహాల్, దాని చుట్టూ సుమారు 20 గదులతో ఉంటుంది. గోపురాలను డంగుసున్నం, బంకమట్టిని వినియోగించారు.

గోపురాలు,కమాన్‌లు మొగలాయి వాస్తుశైలిని సంతరించుకొంటే గోడలపై  రూపొం దించిన కళాత్మక దృశ్యాలు, లతలు,వివిధ రకాల డిజైన్లు ఇరాన్,రాజస్థానీ శైలిలతో రూపుదిద్దుకున్నాయి. అంతేకాదు ఈ భవంతిలో చక్కటిగాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్ల గా ఉండేలా టౌన్‌హాల్ ఎంతో వైవిధ్యభరితంగా ఉం టుంది. అప్పట్లో రూ.20లక్షల వ్యయంతో దీనిని కట్టిం చారు. 1985లో వినియోగంలోకి వచ్చిన నూతన అసెంబ్లీ భవనం కూడా పాతటౌన్‌హాల్ నిర్మాణశైలిలోనే జరిగింది.  

 సత్యమేవ జయతే: ప్రపంచశాంతిదూత , స్ఫూర్తిప్రదాత, అహింసామూర్తి గాంధీజీ కాంస్య విగ్ర హం అసెంబ్లీ భవనానికి మరింత పరిపూర్ణతను తెచ్చిపెట్టింది. పాలకులు,ప్రతిపక్షాలు అంతా ఒకేచోట సమావేశమై ప్రజల ఆకాంక్షలను,కోరికలను,అవసరాలను,సమస్యలను,అభివృద్ధిని, వెనుకబాటుపై చర్చిస్తూ, తీర్మానిస్తూ, సమీక్షిస్తూ సాగే శాసనసభా సమావేశాలు రాష్ట్ర ప్రగతికి మైలురాళ్లు. అలాంటి జనరంజకమైన పాలనకు కేంద్రబిందువైన టౌన్‌హాల్‌పై ఇప్పుడు నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. నగరంలోని అ న్ని చారిత్రక కట్టడాల పరిరక్షణ పురావస్తుశాఖ ఆధీనంలో ఉంటే అసెంబ్లీ మాత్రం రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ అద్భుతమైన కట్టడాన్ని ఇప్పటికీ వారసత్వ కట్టడంగా పరిగణించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.  
 
నిబంధనలు బేఖాతర్: చారిత్రక కట్టడాలకు వందమీటర్లదూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దనే ఆదేశాలున్నా పట్టి ంచుకునే వారు లేరు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈనిబంధన కచ్చితంగా పాటిస్తున్నారు. కానీ నగరంలో మాత్రం దీన్ని ఉల్లంఘించారు. అసెంబ్లీ భవనానికి సమీపం నుంచే మెట్రోరైలు మార్గాన్ని నిర్మించడమే ఇందుకు నిదర్శనం. మిగతా నగరాల్లో అండర్‌గ్రౌండ్ మార్గాలు నిర్మించగా ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement