సాక్షి, హైదరాబాద్ : మందుల్లో పాదరసాన్ని వినియోగించడం ఇప్పుడు ఆశ్చర్యం కాకపోవచ్చు.. కానీ 1,200 ఏళ్ల కిందటే ఈ ప్రక్రియ జరిగితే!!! ఆకు పసర్లు, మూలికలే మందులుగా ఉండే కాలంలో ఇంత పరిజ్ఞానం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతాం. కానీ 9వ శతాబ్దంలోనే సిద్ధ నాగార్జునుడు అనే వైద్య ప్రముఖుడు దీన్ని ఆచరించి చూపాడు. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ గడ్డమీదే. మహబూబ్‌నగర్ జిల్లా ఏలేశ్వరంలో జరిపిన తవ్వకాల్లో ఆయన వినియోగించిన పరిశోధనశాల వెలుగు చూసింది.
అప్పట్లో ఆయన రాసిన రసేంద్ర మంగళం గ్రంథాన్ని ఉటంకిస్తూ పద్మనాయకుల హయాంలో రాసిన తాళపత్ర గ్రంథాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇలా ఇదొక్కటే కాదు ప్రపంచానికి తొలి శాస్త్రీయ వైద్యాన్ని అందించిన ఆయుర్వేదంలో ఇలాంటి అద్భుతాలెన్నో. ఇవన్నీ పుక్కిటి పురాణాలుగా కొట్టేసే విషయాలు కాదు. ఆధారాలతో సహా ఉన్నాయన్న సంగతి అంతర్జాతీయ పురావస్తు సదస్సులో ప్రధానాకర్షణగా నిలిచింది.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్‌లో సహాయ సంచాలకులు డాక్టర్ గోలి పెంచల ప్రసాద్ తన పరిశోధనల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, చరిత్రకారులు డాక్టర్ రాజారెడ్డి దీనికి అనుబంధంగా పలు విషయాలను వెల్లడించారు. వివరాలు వారి మాటల్లోనే..
అగ్గలాంగే గగ్గలమ్
‘‘నేను చికిత్స చేసే క్రమంలో మందులతో జబ్బును తగ్గించేందుకు ప్రయత్నిస్తా. అవసరమైతే శస్త్రచికిత్స చేస్తా’’11వ శతాబ్దంలో చాళుక్యుల హయాంలో ప్రముఖ వైద్యుడిగా వెలుగొందిన అగ్గలయ్య మాట ఇది. ఈయన ఫిజీషియన్‌గా, సర్జన్‌గా అప్పట్లో వెలుగొందారు. ఏ వైద్యుడూ నయం చేయలేని జబ్బు మాయం చేస్తాడన్నది అప్పట్లో ఆయన ఘనతను చెప్పుకొనేవారట.
‘అగ్గలాంగే గగ్గలమ్’అంటూ ఆయనను పిలిచేవారు. ఈయన తొలుత ఓ గ్రామ పెద్దగా ‘గౌండ్’హోదాను, ఆ తర్వాత సామంత రాజు హోదాను దక్కిం చుకున్నారు. ఈ విషయాలు సైదాపూర్‌లో వెలుగుచూసిన ఓ శాసనం వెల్లడిస్తోంది. ఆయన ‘వైద్య రత్నాకర ప్రాణాచార్య’ బిరుదు కూడా అందుకున్నారు. నాటి ఓ జైన ఆలయానికి వైద్య రత్నాకర జినాలయం అనే పేరు పెట్టారు. ఆయన పేరుతో స్తూపంపై నాటి రాజు జయసింహ–2 శాసనమే చెక్కించారు.
జ్వరాలయం.. ఓ మెడికల్ కాలేజీ
ఒకటి, రెండు శతాబ్దాల్లో నాగార్జున కొండ వద్ద విహారే ముఖ్య జ్వరాలయం కొనసాగింది. ఇది నాటి మెడికల్ కళాశాల. అందులో జ్వరాలకు ప్రత్యేక విభాగం ఉండేది. 1920లో జరిగిన తవ్వకాల్లో వెలుగుచూసిన శాసనం దీన్ని పేర్కొంటోంది. 2, 3 శతాబ్దాల్లో సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో కూడా ఇలాంటి అంశమే వెలుగుచూసింది.
అక్కడ నిలబెట్టిన ధర్మ చక్రం ఓ వైద్యుడికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నవారే ఆ స్థూపాన్ని నిలపాల్సి ఉంటుంది. నాటి రాజు ధేమసేన ఆస్థాన వైద్యుడుగా కొనసాగుతున్న రాజవైద్యుడితో దాన్ని నిలబెట్టించారు. నల్లగొండ జిల్లా రామన్నపేట సమీపంలోని తుమ్మలగూడెంలో లభించిన శాసనంలో విష్ణుకుండినులు–5కు చెందిన గోవిందవర్మన్ నాటి వైద్య అవసరాలకు మందుల కొనుగోలుకు గ్రాంటు విడుదల చేసిన అంశం చెక్కి ఉంది.
అశోకుడి కాలంలో జంతువులకూ వైద్యం
12వ శతాబ్దంలో నాటి వైద్యుడు మేడవారి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించినందుకు పరహిత బిరుదు పొందినట్టు శాసనంలో ఉంది. ఉచిత వైద్యం అందించిన వారికి భూమిని కూడా అందించినట్టు శాసనంలో పేర్కొన్నారు.
800 ఏళ్ల కిందట చోళ రాజు వీర రాజేంద్ర–2 ప్రజల వైద్య అవసరాల కోసం 15 పడకల ప్రసూతి ఆసుపత్రిని నిర్మించి అందులో ఒక ఫిజీషియన్, ఒక సర్జన్, చాలినంత మంది సిబ్బందిని వినియోగించినట్టు తిరుమక్కదల్ శాసనం వెల్లడిస్తోంది. ఇక అశోకుడి కాలంలో మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్యం చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment