మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్‌లను కలపాలని సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలపాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వీటిని తుది నోటిఫికేషన్‌లో పొందుపరచాలని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ అంశాలపై చర్చించేందుకు మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమం త్రితో సమావేశమైనట్టు సీఎం కార్యాలయం శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలు శంషాబాద్‌కు సమీపంలో ఉంటాయని, ఈ మూడు మండలాల ప్రజలు శంషాబాద్ జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే యాదయ్య ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ మూడు మండలాలను శంషాబాద్‌లోనే ఉంచాలని పట్టుబట్టారు. దీంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిం చారని ఆ ప్రకటన పేర్కొంది. కాగా, తమ వినతిని మన్నించినందుకు వారు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారని ప్రకటన వివరించింది. కాగా, వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చిన్నగూడురు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శుక్రవారం మరిపెడ మండల నాయకులు గుడిపూడి నవీన్, రామసహాయం రంగారెడ్డి, మహేందర్‌రెడ్డి, గుగులోత్ వెంకన్న తదితరులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. చిన్న గూడురు కేంద్రంగా మండలం ఏర్పాటు కావాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని రెడ్యానాయక్ ముఖ్యమంత్రికి వివరించారు. మరిపెడలోని 5, నర్సింహపేటలోని 4, కురవిలోని 2, మహబూబాబాద్‌లోని 3 గ్రామాలను కలిపి చిన్నగూడురు మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రికి ప్రతిపాదన అందించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ఏర్పడే మహబూబాబాద్ జిల్లాలో చిన్నగూడురును మండలంగా చేర్చాలని సీఎం ఆదేశించారని వివరించింది.
శంషాబాద్‌లో మరో మూడు మండలాలు
Published Sat, Sep 17 2016 3:26 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement