రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి 3 నెలల జైలుశిక్ష
అప్పు ఎగవేత, చెక్కుబౌన్స్ కేసులో కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: అవసరం నిమిత్తం రూ.30 లక్షలు అప్పు తీసుకుని ఎగవేసిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి న్యాయస్థానం 3 నెలల జైలుశిక్ష విధిం చింది. దానిని అప్పిలేట్ కోర్టు కూడా సమర్థిస్తూ.. అప్పు వడ్డీతో సహా చెల్లిం చాలని ఆ విశ్రాంత ఉద్యోగికి స్పష్టం చేసింది. లేనిపక్షంలో అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన ఎల్.సుబ్బరామిరెడ్డి వద్ద కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జి.వి.రమణారెడ్డి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2006లో రూ.30 లక్షలు తీసుకున్నారు.నెలకు 3శాతం వడ్డీ చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్న సుబ్బరామిరెడ్డి రూ.10 లక్షల చొప్పున 3 చెక్కులను రమణారెడ్డికి ఇచ్చారు.
అప్పులో కొంత భాగాన్ని చెల్లించేందు కు రమణారెడ్డి 2009లో సుబ్బరామిరెడ్డికి కొన్ని చెక్కులు ఇచ్చారు. కానీ అవి బౌన్స్ అయ్యాయి. దీంతో సుబ్బరామిరెడ్డి కూకట్‌పల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో రమణారెడ్డిపై కేసు పెట్టారు. తాను సుబ్బరామిరెడ్డి నుంచి అప్పు తీసుకోలేదని, ప్లాట్ల కొనుగోలు లావాదేవీలకు సంబంధించి సర్దుబాటు నిమిత్తం తనకు చెక్కులు ఇచ్చారని రమణారెడ్డి కోర్టుకు చెప్పారు. కానీ ఆ సొమ్మును అప్పుగానే తీసుకున్నట్లు కోర్టు తేల్చింది. ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెం ట్స్ యాక్ట్’ కింద రమణారెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ.. జైలు శిక్ష విధిం చింది. అసలు రూ.30లక్షలతో వడ్డీ, జరిమానా కింద మరో రూ.16 లక్షలు కలిపి మొత్తం రూ.46లక్షలను సుబ్బరామిరెడ్డికి చెల్లించాలంది. ఈ తీర్పుపై రమణారెడ్డి అప్పిలేట్ కోర్టుకు వెళ్లగా.. శిక్ష విధింపును సమర్థించింది. అయితే జరిమానాను మాత్రం కొంత తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.