‘కృష్ణా’పై కమిటీని రద్దు చేయండి
- కేంద్రమంత్రి ఉమాభారతికి సీఎం కేసీఆర్ లేఖ
- తటస్థ సభ్యులతో కొత్త కమిటీ వేయాలని వినతి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నిర్వహణపై కేంద్ర జల వనరుల శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో సభ్యుల నియామకాన్ని తప్పు పట్టింది. ఈ కమిటీని రద్దు చేసి తటస్థ సభ్యులతో కమిటీని మళ్లీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కేంద్రమంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ, వాటి నియంత్రణ, విద్యుత్ పంపకాలు తదితరాలపై వివాదాలు రేగుతుండటంతో వాటిపై కమిటీ వేయాలని కేంద్రం మూడు నెలల కిందటే నిర్ణయించింది.
ఈ నెల 7న కేంద్ర జల వనరుల శాఖ అయిదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోఉన్న ఇద్దరు సభ్యుల నియామకాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. వీరిద్దరికీ ఏపీతో సంబంధాలున్న దృష్ట్యా తెలంగాణకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా వ్యవహరించే అవకాశముందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ‘‘నిపుణుల కమిటీలో ఉన్న మొహిలే కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్. గతంలో రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా పని చేశారు.
ఆయన ఇచ్చిన నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఉంది. ఆ నివేదికపై తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. నిపుణుల కమిటీలో ఆయనను కొనసాగించటం సరైంది కాదు. మరో సభ్యుడిగా ఉన్న ఎంకే గోయల్.. రూర్కీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో శాస్త్రవేత్తగా ఉన్నారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేస్తున్నారు. దీంతో ఆయన తన ప్రయోజనాల కోసం ఏపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశముంది’’ అని ముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణకు సంబంధం లేని తటస్థ నిపుణులతో కమిటీని వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు ప్రస్తుత కమిటీని నిలుపుదల చేయాలని కోరారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం దీనిపై నేరుగా కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలసి ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు.