మరో జడ్జీపై ఏసీబీ కేసు | ACB case on another judge | Sakshi
Sakshi News home page

మరో జడ్జీపై ఏసీబీ కేసు

Published Sat, Apr 14 2018 2:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

ACB case on another judge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జీలపై ఏసీబీ దూకుడు పెంచింది. గడిచిన నెల రోజుల్లో ఇద్దరు జడ్జీలపై కేసులు నమోదు చేసిన ఏసీబీ.. శుక్రవారం మరో సెషన్స్‌ జడ్జీపై కేసు నమోదు చేసింది. నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌ రాధాకృష్ణమూర్తిపై అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అల్వాల్‌లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది.

ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ రమణకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ విలువైన ఆస్తుల పత్రాలు లభించాయని, వాటి వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన దత్తు అనే విద్యార్థి బెయిల్‌ కోసం రూ.7.5 లక్షల లంచం తీసుకున్నట్టు హైకోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో అంతర్గతంగా న్యాయశాఖ విచారణ జరిపి, వాస్తవం అని తేలడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖను హైకోర్టు ఆదేశించింది.

ఏసీబీ అధికారులు రంగంలోకి దిగగా విషయం మొత్తం బయటపడింది. ఎక్సైజ్‌ కేసు   (ఎన్‌డీపీఎస్‌యాక్ట్‌)లో పట్టుబడ్డ ఎంటెక్‌ విద్యార్థి దత్తు నుంచి అడ్వొకేట్లు కె. శ్రీనివాస్‌రావు, జి. సతీశ్‌కుమార్‌ ద్వారా జడ్జి రాధాకృష్ణమూర్తి రూ.7.5 లక్షలు లంచం తీసుకున్నట్టు తేలిందని ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు తెలిపారు. రెండు వాయిదాల ద్వారా ఈ లంచాన్ని దత్తు తల్లి తన బంగారం తాకట్టు పెట్టి ఇచ్చినట్టు దర్యాప్తులో వివరించారు. జడ్జితో పాటు ఇద్దరు అడ్వొకేట్లను అరెస్ట్‌ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.  

అడ్వొకేట్‌ శ్రీరంగారావు ఫిర్యాదుతో...
నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి రాధాకృష్ణమూర్తి వ్యవహారంపై గతేడాది నవంబర్‌లో అడ్వొకేట్‌ శ్రీరంగారావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దత్తు కేసులో జడ్జి రూ.10 లక్షల లంచాన్ని న్యాయవాదుల ద్వారా డిమాండ్‌ చేసి, రూ.7.5 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.

ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రజల్లో న్యాయశాఖపై నమ్మకం పోతోందని, దీనికి అడ్డుకట్ట వేసి న్యాయదేవతను రక్షించాలంటూ ఆయన న్యాయమూర్తిని వేడుకున్నారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు అంతర్గత విచారణ జరిపి ఏసీబీకి ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. జడ్జి వ్యవహారం వెలుగులోకి రావడంతో న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement