అగ్రిగోల్డ్ కేసు సీబీఐకి!
- సంసిద్ధత వ్యక్తం చేసిన ఏపీ సర్కారు
- మీ వైఖరి ఏమిటో చెప్పాలని టీ సర్కార్‌కు ఆదేశం
- సంసిద్ధత లేఖలిస్తే పరిశీలించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం
- తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత కేసుల దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు కేసులను సీబీఐకి అప్పగించే విషయంలో వైఖరి ఏమిటో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించే విషయంలో సంసిద్ధత లేఖలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని, వాటిని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది.
సీబీఐ దర్యాప్తు చేపట్టినంత మాత్రాన ఆస్తుల వేలం ఆగదని, తమ పర్యవేక్షణలో ఇప్పుడు జరుగుతున్న విధంగానే వేలం ప్రక్రియ కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. అదే విధంగా గురు, శుక్రవారాల్లో తలపెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని వేలం పర్యవేక్షణ కమిటీకి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఖాతాదారుల నుంచి రూ.7వేల కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం వాటిని మరోసారి విచారించింది.
డిపాజిట్ చేశారా? లేదా?...
విచారణ ప్రారంభం కాగానే తాము ఆదేశించిన మేర వేలం నిర్వహణ ఖర్చుల కోసం డిపాజిట్ చేయమని చెప్పిన రూ.25 లక్షలను డిపాజిట్ చేశారా? లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ యజమానులు జైల్లో ఉన్నందున డిపాజిట్ చేయలేదని వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ కోర్టుకు నివేదించారు. ఈ వాదనను పట్టించుకోని న్యాయస్థానం తాము ఆదేశించిన విధంగా రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. తరువాత ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. దీంతో ఈ విషయమై తమ వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.