తిరిగి రండి...కలసి పనిచేద్దాం!
కుర్చీ అప్పగించేందుకు సిద్ధం.. పార్టీ వీడిన వారికి ఒవైసీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: పాత తప్పిదాలను మరచి కలసి పనిచేద్దామని.. పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. తానంటే గిట్టకుంటే వారికి కుర్చీ అప్పగించి సేవ చేసేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో జరిగిన మజ్లిస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముస్లింల ఐక్యతే తమ లక్ష్యమని దీనికి వారంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. హిందుత్వ శక్తులు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
ముస్లిం మనోభావాలను దెబ్బతీసేవిధంగా చట్టాలు రూపొందుతున్నాయన్నారు. ముస్లింలంతా ఏకమైతే 50 పార్లమెంట్ స్థానాల్లో విజయం తప్పదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ సభలో ఎమ్మెల్సీలు రజ్వీ, జాఫ్రీ, ఎమ్మెల్యేలు మౌజమ్ ఖాన్, ముంతాజ్ ఖాన్, అహ్మద్ బలాల, కౌసర్ మొహియిద్దీన్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.