కలెక్షన్.. అటెన్షన్.. మధ్యలో టార్గెట్
* ఓవైపు మద్యం అమ్మకాల పెంపు.. మరోవైపు కల్తీ, గుడుంబాల నియంత్రణ
* జిల్లాల్లో ఎక్సైజ్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ల
* విస్తృత పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యాన్ని అరికట్టడంతోపాటు వార్షిక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆబ్కారీ శాఖ తంటాలు పడుతోంది. ఆబ్కారీ శాఖ ఫిబ్రవరి నెల వరకు సాగించిన మద్యం అమ్మకాలు, లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ఫీజు తదితరాల ద్వారా వచ్చిన మొత్తంలో ఖర్చులు, చెల్లింపులు పోగా వచ్చిన రెవెన్యూ రూ.10, 238 కోట్లు. ఇందులో వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, సీఎంఆర్‌ఎఫ్ చెల్లింపులుపోగా రూ.3,484 కోట్లు ఆదాయంగా సమకూరింది.
అయితే, కేవలం రెవెన్యూ రూపంలోనే రూ.12,500 కోట్ల మేర వార్షికాదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు సాగే మద్యం అమ్మకాలు, డిస్టిలరీలు, బ్రూవరీలు చెల్లించే ఫీజుల రూపంలో ఈ లక్ష్యం చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
కఠిన చర్యలు...
అదే సమయంలో గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించిన 8 జిల్లాల్లో మళ్లీ నాటుసారా తయారీ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కూడా ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ బాధ్యత ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ తీసుకున్నారు. 8 జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేసి, ఆయా సర్కిళ్ల ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లను బాధ్యులను చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా ఎనిమిదింటిని గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించారు.
గుడుంబాను నిర్మూలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలోనే నిర్ణయానికి వచ్చి, ఆ దిశగా చర్యలకు ఆదేశించినా వరంగల్‌లో ఇంకా గుడుంబా పేదలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో గుడుంబాను నిర్మూలించే పనిని అకున్‌సబర్వాల్ భుజానికి ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ చంద్రవదన్, అకున్ సబర్వాల్ విడివిడిగా జిల్లా పర్యటనలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ వంటి జిల్లాల్లో ఈనెలాఖరు వరకు లక్ష్యాలకు అనుగుణంగా మద్యం అమ్మకాలు జరిపేలా ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారిన ఆబ్కారీ శాఖ నుంచి భారీ రెవెన్యూ సాధించాలన్న ఆలోచనతో ఉన్న ఇద్దరు అధికారులు ఎంత వరకు సఫలీకృతులవుతారో చూడాలి.