
ధర్నాచౌక్.. ప్రజల హక్కు
- ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ అఖిలపక్ష సమావేశంలో వక్తలు
- 12న అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్షకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడం.. ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిర్వహించింది. ధర్నాచౌక్ పరరిక్షణ అనేది ఒక స్థలాన్ని కాపాడుకోవడానికి కాకుండా ప్రజల హక్కును కాపాడుకునే అంశంగా చూడాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. దీనికోసం ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేయాల్సిందేనని నిర్ణయించింది.
ఈనెల 8న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు, 9న డీజీపీకి వినతి పత్రం, 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం, 12న అసెంబ్లీ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, సామాజిక భద్రతలు ప్రభుత్వ బాధ్యత అని, వీటి పేరిట నిరసన హక్కును హరించడం సరికాదని గతంలో ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా కోర్టు గుర్తుచేసిందని తెలిపారు.
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: భట్టి
ప్రజల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసించడం ప్రజల హక్కు. రాజరికం, నియంతల కాలంలోనూ ప్రజల సమస్యలను వినడం కోసం ప్రజా దర్బారులను నిర్వహించేవారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి స్థానం లేకుండా చేశారు. ధర్నాలు, నిరసనలను ఒక పార్టీ కార్యాలయంలో తలుపులు పెట్టుకుని చేయాల్సిన దుస్థితి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానం. అబ్సెంటీ సీఎం అనేది సీఎం కేసీఆర్‌ను చూసి అనుకోవాల్సి వస్తోంది.
అణచేస్తున్నారు : ఎల్.రమణ
అడ్డగోలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయ లేక ప్రజలను అయోమయానికి గురిచేసే కుట్రలో భాగంగానే ధర్నాచౌక్‌ను ఎత్తివేశారు. ధర్నాలు, నిరసనలకు అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్ అసమర్థత, అవినీతి, కేసీఆర్ కుటుంబ సభ్యుల అరాచకాలు ప్రజలకు అర్థమవుతాయని భయపడుతున్నారు.
ఆత్మగౌరవం కోసం పోరాడితే..: చాడ
ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ కావాలని సబ్బండ వర్గాలు ఉద్యమించాయి. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆత్మవంచన చేసుకుని పాలిస్తున్నారు. ఇది ఎక్కువకాలం సాగదు. తెలంగాణ కోసం పోరాడినట్టే హక్కుల పరిరక్షణ కోసం కూడా ఉద్యమిస్తాం.