గంటలో1450 గుంజీలు తీసిన అమీర్
హైదరాబాద్ : కొడుకుపై తండ్రికున్న వాత్సల్యం ఇది. కొడుకు కోసం తండ్రి గంటలో 1450 గుంజీలు తీశాడు. కుమారుడి చికిత్స కోసం తండ్రి పడరాని పాట్లు పడ్డాడు. కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోంది..... చికిత్స చేయడానికి తగినంత ఆర్థిక స్థోమత లేదు. దాంతో ఏం చేయాలా అని ఆ పేద తండ్రి ఆలోచించాడు. తన కుటుంబ దయనీయ స్థితిని చాటి చెప్పేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. గుంజీలు తీసి రికార్డు నెలకొల్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడు.సికింద్రబాద్ ఆర్పీ రోడ్డులో గుజరాతీ ఉన్నత పాఠశాలలో.. అమీర్ గంటలో 1450 గుంజీలు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వివరాల్లోకి వెళితే మల్కాజ్‌గిరి వాణీ నగర్‌లో ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తున్న అమీర్ .. ఏడేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల పెద్ద కుమారుడు అమన్ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. కాళ్ళు చచ్చు బడిపోయాయని, చికిత్స చేయించేందుకు స్థోమత లేకపోవడంతో ఈ రికార్డుకు ప్రయత్నించినట్లు అమీర్ తెలిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు దీన్ని పంపనున్నట్లు వెల్లడించాడు. దీని వల్ల డబ్బులు వస్తే తన కుమారుడి వైద్య ఖర్చుల కోసం ఉపయోగపడతాయని ఆ తండ్రి ఆశగా చెప్పాడు.