సహజీవన సారం... | An extract of a symbiotic ... | Sakshi
Sakshi News home page

సహజీవన సారం...

Published Sun, Dec 1 2013 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

An extract of a symbiotic ...

= సుప్రీం తాజా తీర్పుతో ఆమోదముద్ర
 = నగరంలో పెరుగుతున్న అనుబంధాలకు ఆసరా
 = పెళ్లిలో ఉన్న సమస్యలు దీనిలోనూ ఉన్నాయంటున్న ‘లివిన్’జంటలు

 
వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా,  ప్రేమించుకున్న స్త్రీ, పురుషుడు కలిసి ఉండడమే  ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’. విభిన్న సామాజిక పరిస్థితుల నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘సహజీవన’ సంస్కృతి పాశ్చాత్య దేశాలకు బాగా పాత. ఇప్పటికీ చాలామంది నటీనటులు తమ ప్రేమికుడు/ప్రేమికురాలితో ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. భారతదేశపు మెట్రో నగరాలన్నింటిలోనూ ఈ ట్రెండ్ విస్తరిస్తుండటం విశేషం. ముఖ్యంగా కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాల్లో  పెళ్లికి ప్రత్యామ్నాయంగా కొందరు ఈ అనుబంధం ఏర్పరుచుకుంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ రకమైన అనుబంధాలకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నగరంలో సహజీవనం చేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పూర్వాపరాలపై విశ్లేషణ ఈ కథనం.         
       
                          
‘పెళ్లి అనేది పాత కాన్సెప్ట్’ ఇటీవలే సీనియర్ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే పెళ్లి అంతరిస్తోందా? మన దేశంలో 2004 నుంచి చూస్తే లివిన్ అనుబంధాల్లో పెరుగుదల 60 శాతం కనిపిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, పూణె.. నగరాల్లో అత్యధిక సంఖ్యలో యువ లివిన్ జంటలు నివసిస్తున్నాయని ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ప్రసిద్ధ ఫ్యామిలీ కౌన్సిలర్ అశోక్‌జైన్ అన్నారు. హ్యాపీ మ్యారేజెస్ ఈజీ డైవోర్సెస్ శకం ఇది అని ఆయన అభిప్రాయపడ్డారు.

విడాకుల కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఎమ్‌ఎన్‌సీలకు చెందిన విడాకుల కేసుల విచారణ కోసం చెన్నై కోర్టు ప్రత్యేక విభాగాన్నే దీనికోసం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు కూడా. కుటుంబలక్ష్యాలు లోపించడం, వ్యక్తిగత వ్యవహారాలకి ప్రాధాన్యం పెరగడం, దంపతులిద్దరూ చెరోలోకం అన్నట్టు ఉండడం.. వంటివన్నీ దాంపత్య బంధాల వైఫల్యానికి తద్వారా లివిన్‌పై ఆసక్తి పెరగడానికి దోహదం చేస్తున్నాయన్నారు. అయితే ఏ రకమైన అనుబంధమైనా.. ‘ఐయామ్ రైట్’ అనే భావన కావాలో, సంతోషం కావాలో వీళ్లు తేల్చుకోవాల్సి ఉందన్నారు.

అయితే లివిన్ జంటలకు అంతా హ్యాపీగా ఉందని అనుకోవడానికి లేదు. వీరికి కనీసం అద్దె ఇళ్లు కూడా  దొరకడం లేదు. ‘నేను మా టీం లీడర్‌తో ‘రిలేషన్’లో ఉన్నా. మేమిద్దరం పెళ్లి కాలేదని చెప్పి, ఇల్లు కావాలంటే ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. చివరకు భార్యాభర్తలం అని అబద్ధం చెప్పి ఇల్లు తీసుకున్నాం. దీని కోసం అప్పటికప్పుడు మంగళసూత్రాలు కొనాల్సి వచ్చింది’ అని పూణె నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న శీతల్ చెప్పింది. ఇలాంటి కష్టాలను లివిన్ జంటలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాయి.
 
 గృహహింస ఎక్కువే..
 ఇప్పుడిప్పుడే నగరంలో సహజీవనానికి సంబంధించి గృహహింస కేసులు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. ఇప్పటికే  పలువురు మహిళలు ఈ చట్టం కింద కేసులు వేసినట్టు ఓ ఎన్‌జీఓ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘ఏరి కోరి ఎంచుకున్న ఈ లివిన్ రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్ చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నా కూడా ఎంతో మంది విద్యావంతులైన మహిళలు సైతం ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న పరిస్థితి మేం గమనించాం’ అని ఆంధ్రప్రదేశ్ కొయలేషన్ ఆఫ్ జెండర్ జస్టిస్ (ఏపీసీజీజే) వలంటరీ కౌన్సిలర్ అనురాధ అంటున్నారు. వీటిలో చాలా వరకూ కేసులు సన్నిహితులో, బంధువుల ప్రోత్సాహం వల్ల మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని కూడా ఈ తరహా అనుబంధాలను నిలబెట్టుకోలేకపోయామనే విమర్శను ఎదుర్కోలేక చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని ‘అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ డెరైక్టర్ బీనా అంటున్నారు. అచ్చం పెళ్లయిన మహిళ ఏ కారణాల వల్లనైతే గృహహింసకు గురవుతుందో.. అవే కారణాలే ఇందులోనూ మహిళను కడగండ్ల పాలు చేస్తున్నాయని ఎన్‌జీఓ వలంటీర్లు చెబుతున్నారు. లివింగ్ టుగెదర్‌కు సిద్ధపడ్డవారిలో సహోద్యోగులే ఎక్కువని,  కలసి పనిచేసే చోట ప్రారంభమవుతున్న ఈ తరహా ఘర్షణాత్మక వాతావరణం ఇంటి వరకు విస్తరిస్తోందని బీనా విశ్లేషిస్తున్నారు.
 
 వదలని ‘ఇగో’.. అనుమానం..
 తన భాగస్వామి వృత్తిపరమైన అసూయ కారణంగా హింసకు దిగుతున్నాడని ఓ బాధిత మహిళ చెప్పింది. లివిన్‌లో బంధానికి కట్టుబడి ఉండాలనే నియమమేదీ లేకపోవడంతో భాగస్వాములిద్దరూ.. ముఖ్యంగా మగవాళ్లు భార్యలపై అనుమానాలు ఎక్కువగా పెంచుకుంటున్నారు. తనను అనుమానించిన తన పార్ట్‌నర్ తనపై అమీర్‌పేటలోని ఓ డిటెక్టివ్‌ని ప్రయోగించాడని, ఆ విషయం తెలిసి అతనితో అనుబంధాన్ని వదులుకున్నానని ఓ ఎన్‌జీఓ కౌన్సిలింగ్‌కు వచ్చిన మరో యువతి చెప్పింది. అయితే వీరిలో చాలా మంది కలిసి ఉండడం కోసం పెళ్లికి బదులుగా తాము ఎంచుకున్న పంథా విషయంలో పశ్చాత్తాపం చెందడం లేదు.  పెళ్లి వల్ల పురుషుడికి మరిన్ని అపరిమిత అధికారాలు సంక్రమిస్తాయి అని వీరిలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. భూమిక అనే ఎన్‌జీఓ హెల్ప్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ పొందిన మహిళ మాట్లాడుతూ..‘పెళ్లికాకుండా పార్ట్‌నర్‌తో కలిసి జీవించడానికి నేను నిర్ణయించుకున్నందుకు పలుమార్లు బాధపడిన సందర్భాలున్నాయి. చుట్టుపక్కల ఇళ్లలో మమ్మల్ని ఎవరూ దంపతులుగా గుర్తించకపోవడమే కాకుండా కనీసం ఎటువంటి సాయం కూడా చేసేవారు కాదు. అయితే ఆ సమస్యలన్నీ నా పార్ట్‌నర్ చిత్రహింసల దెబ్బకు ఏ మూలకో పోయాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
 
 వృద్ధాప్యంలోనూ.. సహజీవనం..
 ఇది కేవలం యువత కోసమే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఒంటరి వృద్ధులను సైతం ఈ లివింగ్ టుగెదర్ జంటలుగా మారుస్తోంది. రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లో.. వినమూల్య అమూల్య సేవ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం లివిన్ మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళాలకు వేలాదిమంది హాజరవుతున్నారు. మన నగరంలో సైతం తోడు నీడ అనే స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


 పాలు అమ్మే వ్యక్తి దగ్గర్నుంచి పక్కింటి వ్యక్తి వరకు ఎంతో మంది అనుమానపు చూపులు ఎదుర్కోవల్సి రావడం, కొన్నేళ్ల పాటు కలిసి జీవించినా ఒకరిపై ఒకరికి ఎటువంటి హక్కులూ సంక్రమించకపోవడం, అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోతే.. జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎటువంటి వీలూ లేకపోవడం.. వగైరాప్రతికూలతలు కనబడుతున్నా.. బంధమే తప్ప నిర్బంధాలు లేకపోవడం, ఏ రోజైనా స్వేచ్ఛగా నిష్ర్కమించే వీలుండడం.. తదితర కొన్ని ఆకర్షణలు ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో యువతను లివింగ్ టుగెదర్‌వైపు ప్రేరేపిస్తున్నాయి. అయితే తరాలకు అతీతంగా వర్థిల్లుతున్న వివాహమనే పటిష్ట సంప్రదాయానికి ఇది ఏ రకంగానూ  ప్రత్యామ్నాయం కాలేదనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో పరిస్థితుల ఒత్తిడి కారణంగానో, తమపై తమకున్న నమ్మకంతోనో లివ్‌ఇన్‌కు ఓటేస్తున్న యువత దానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాజా తీర్పు ద్వారా సుప్రీం చేసిన సూచన అనుసరణీయం.
 
 సుప్రీం తీర్పునకు నేపథ్యం..
 ఇంద్రశర్మ అనే మహిళ వీకేవీ శర్మ అనే వివాహితుడు, ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో కలిసి వ్యాపారంతో పాటు జీవితాన్ని కూడా పంచుకుంది. అయితే ఏడేళ్ల తర్వాత అతను తన కుటుంబం కోసం వెనక్కు వెళ్లాడు. ఈ అనుబంధం ముగిశాక ఇంద్రశర్మ బెంగుళూరు కోర్టులో భరణం కోరుతూ పిటిషన్ వేసింది. నెలకు రూ.25వేలు మనోవర్తితో పాటు తన వైద్యఖర్చుల కోసం అయిన రూ.3.50లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. వైవాహిక చట్టం కింద ఈ కేసు వర్తించదని తేల్చింది. ఈ కేసులో మనోవర్తి చెల్లించేందుకు ఆదేశాలు ఇవ్వడమంటే చట్టప్రకారం భార్యగా ఉన్న మహిళ, ఆమె పిల్లలకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లు లివిన్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
 
 ఆహ్వానించదగ్గ పరిణామం..     
 నాకు తెలిసిన చాలా మంది ఇష్టపూర్వకంగా దీనిలోకి దిగుతున్నారు. ఐటీ మాత్రమే కాదు ఇతర రంగాలకు చెందినవారు కూడా చాలా మంది ఈ అనుబంధానికి సిద్ధపడుతున్నారు. మన నగరం అనే కాదు రాష్ట్రంలోని చిన్న చిన్న ఊర్లకు సైతం ఇది పాకింది. అనుకున్నదే తడవు.. దీనికి పెద్దగా సన్నాహాలవీ అక్కర్లేదు కాబట్టి సులభంగా అనుబంధంలోకి దిగిపోతున్నారు. అంతే సులభంగా విసిగిపోతున్నారు. ప్రస్తుతానికి లివింగ్ టుగెదర్ అనేది హక్కులు, బాధ్యతలు లేని సంబంధం కాబట్టి.. వారికి ఎలా సలహా ఇవ్వాలో కూడా మాకు అర్థం కావడం లేదు. రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులలో ఈ తరహా కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా మారాల్సిందే కాబట్టి దీనిని కొన్ని దేశాల్లో ఇప్పటికే చట్టబద్ధం చేశారు. మనం కూడా ఆ బాట పట్టాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగిన పరిణామం.  
 - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement