ఇక పరీక్షలు చేసి తినాలేమో! | And to eat no more tests! | Sakshi
Sakshi News home page

ఇక పరీక్షలు చేసి తినాలేమో!

Published Tue, Feb 2 2016 3:35 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఇక పరీక్షలు చేసి తినాలేమో! - Sakshi

ఇక పరీక్షలు చేసి తినాలేమో!

♦ ఆహార పదార్థాల కల్తీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు
♦ కార్బైడ్ దుష్ర్పభావాలను ప్రజలకు తెలియజేయండి
♦ పండ్లను మగ్గించేందుకు కార్బైడ్ వాడకుండా నిరోధించండి
♦ {పజారోగ్యమే అందరికీ ముఖ్యం
♦ ఏపీ, తెలంగాణ అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ
♦ తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘సమాజంలో కేన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నీళ్లు, పాలు, పండ్లు, కూరగాయల కల్తీ వల్ల కేన్సర్ విస్తరిస్తోంది. ఈ కల్తీ గురించి, అందులో చేరుతున్న విష పదార్థాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏది తినాలో ఏది తినకూడదో అర్థం కాని పరిస్థితి నెల కొంది. భవిష్యత్తులో ఇక ఏది తినాలన్నా పరీ క్షలు చేసి తినాలేమో! పండ్లను మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్ వాడుతుండటం వల్ల కలిగే దుష్ర్పభావాలు ప్రజలకు తెలియడం లేదు. ఈ కార్బైడ్ మార్కెట్‌లో అందుబాటులో లేకుండా చూడండి. పారిశ్రామిక అవసరాలు మినహా మిగిలిన ఏ అవసరాలకూ కార్బైడ్ వాడకుండా చర్యలు తీసుకోండి. మామిడి పండ్ల సీజన్ ప్రారంభం కావడానికి ముందే కార్యాచరణ సిద్ధం చేయండి. ఈ వ్యవహారంలో మీపై ఎంతో నమ్మకం ఉంచాం.

మా నమ్మకాన్ని వమ్ము చేయరని విశ్వసిస్తున్నాం’’ అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రాజేశ్వర్ తివారీ, సి.పార్థసారథిలను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్బైడ్ నిరోధానికి సంబంధించి వీరికి ప్రతీ విషయంలోనూ సహకరించాలని, వారు ఏది అడిగితే ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. కార్బైడ్ నిరోధానికి తీసుకోవాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను తమ ముందుంచాలని ఈ కేసులో కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్‌ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఖాళీ పోస్టులను భర్తీ చేయండి
 కాయలను కృత్రిమంగా పక్వానికి తీసుకొచ్చేందుకు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొం డయ్య, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ధర్మాసనం ముందు హాజరయ్యారు. కేవలం మామిడి పండ్లు మాత్రమే కాదు, అరటిపండ్లను కూడా కృత్రిమ పద్ధతుల ద్వారా పక్వానికి తీసుకువస్తున్నారని పూనం మాలకొండయ్య కోర్టుకు నివేదించారు. గేదెలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి అధికంగా పాలు పిండుతున్నారని, ఈ పాలు తాగిన వారు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు.

అక్రమాలకు పాల్పడే వారిపై ఆహార భద్రత చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అయితే సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ‘‘పండ్ల వ్యాపారులకు డబ్బు తప్ప ప్రజారోగ్యం పట్టదు. ఇటీవల మేం అన్ని జిల్లాల నుంచి పండ్ల శాంపిళ్లను తెప్పిస్తే అందులో 94 శాతం శాంపిళ్లు తినేం దుకు పనికి రావని తేలింది. అందుకే కార్బైడ్‌ను నిరోధించండి. ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. విస్తృతంగా తనిఖీలు నిర్వహించండి. ప్రజారోగ్యమే అందరికీ ముఖ్యం’’ అని స్పష్టం చేసింది. నెల రోజులు గడువు ఇస్తే ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని పూనం మాల కొండయ్య కోర్టుకు నివేదించారు. ధర్మాసనం స్పందిస్తూ.... కార్బైడ్ వల్ల కలిగే దుష్ర్పభావాలను ప్రజలకు తెలియజేసేందుకు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement