గవర్నర్‌కు మరో విడత చాన్స్!
పదవీకాలం పొడిగించే అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో విడత పొడిగించే అవకాశాలున్నాయి. తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్ పదవీకాలం వచ్చేనెల 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఆయన్ను మరోసారి గవర్నర్‌గా కొనసాగిస్తారా? కొత్త గవర్నర్‌ను నియమిస్తారా? అనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2010 జనవరిలో నరసింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఛత్తీస్ గఢ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు.
అదే సందర్భంలో కేంద్రం రెండో విడతగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. 2012 మే 3న మరో అయిదేళ్లపాటు పదవీ కాలాన్ని పొడిగించి ఏపీ గవర్నర్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు ఆయననే ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగించింది. ఉద్యమ కాలంతోపాటు విభజన, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ సాధన, విభజన సమస్యల పరిష్కారానికి ఆయన ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. పలుమార్లు నేరుగా ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో కేంద్రం గవర్నర్ పనితీరుపై సంతృప్తికరంగా ఉందని తెలుస్తోంది.
ఇప్పటికీ విభజన అనంతరం అపరిష్కృతంగా ఉన్న వివాదాస్పద అంశాలపై ఆయన ఆధ్వర్యంలో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అందుకే మరోమారు రెండు రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కాగా, రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో సమావేశం, పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు, ఢిల్లీ పరిణామాలను గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. మరోవారం రోజుల్లో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.