
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 108, 104 అంబులెన్స్ సహాయ సేవల వ్యూహకర్త, ప్రెస్‌క్లబ్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అయితరాజు పాండు రంగారావు (75) ఆదివారం తెల్లవారుజామున సోమాజిగూడలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పంజగుట్ట హిందూశ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈయనకు డాక్టర్ భరత్ అనే కుమారుడు ఉన్నారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రంగారావు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శిగా, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి చైర్మన్‌గా, భద్రాచలం ట్రైబల్ ఏరియా ఆస్పత్రి వైద్యాధికారిగా పలు సేవలందించారు. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు, వారి పిల్లల చదువుల కోసం విశేషంగా కృషి చేశారు. ‘హాపింగ్ మెమరీస్’ పేరుతో ఈయన ఆత్మకథ కూడా ప్రచురితమైంది.
పలువురి సంతాపం
పేదలకు వైద్య సేవలు అందించడానికి, మెరుగుపర్చడానికి ఏపీ రంగారావు జీవితాంతం కృషి చేశారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రంగారావు మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి హరినారాయణ, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దేవేందర్‌సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, ఉమ్మడి ఏపీ మాజీ విజిలెన్స్ కమిషనర్ సమల్, ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి మదన్‌మోహన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.