
ఆరోగ్యశ్రీ ఆగింది..!
ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, నర్సింగ్ హోమ్‌లలో సాధారణ ఆరోగ్యశ్రీ సర్వీసులతోపాటు ఎంప్లాయూస్ హెల్త్ స్కీం సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
► ప్రైవేటు ఆస్పత్రుల్లో నేటి నుంచి సేవలు బంద్
► ఆస్పత్రులకు రూ. 250 కోట్లు బకాయి పడిన ప్రభుత్వం
► తొమ్మిది మాసాలుగా చెల్లించకపోవడం వల్లే ఈ నిర్ణయం
► ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్‌ఎస్ సర్వీసులూ నిలిపివేత
► తెలంగాణ ప్రైవేటు, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, నర్సింగ్ హోమ్‌లలో సాధారణ ఆరోగ్యశ్రీ సర్వీసులతోపాటు ఎంప్లాయూస్ హెల్త్ స్కీం సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడిన ఆరోగ్యశ్రీ బిల్లులను మే 1లోగా చెల్లించాలని లేదంటే ఆ మరుసటి రోజు నుంచే సేవ లను నిలిపివేయనున్నట్లు ఇటీవల ఆ సంఘం ప్రతినిధులు డాక్టర్ సురేశ్‌గౌడ్, టి.నర్సింగ్‌రెడ్డిలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే.
తెలంగాణవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో 190 ఆస్పత్రులు ఉండగా వీటిలో 60 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. మిగిలిన 130 ఆస్పత్రుల్లో కార్పొరేట్, ప్రెవేటు నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 80 వేల శస్త్రచికిత్సలు చేయగా ఇందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత తొమ్మిది నెలల నుంచి బిల్లులు చెల్లించక పోవడంతో నర్సింగ్‌హోమ్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. బకాయిలు చెల్లించాల్సిందిగా కోరుతూ ఇప్పటికే పలుమార్లు వైద్య ఆరోగ్య మంత్రితోపాటు ట్రస్ట్ సీఈవోకు విన్నవించామని, వారి నుంచి స్పందన లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని డాక్టర్ సురేశ్‌గౌడ్, టి.నర్సింగ్‌రెడ్డిలు పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఇందుకు సహకరిస్తున్నాయని తెలిపారు. అయితే దీనిపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంతరాయం కలిగించొద్దు: ఆరోగ్య శ్రీ బకాయిలను సోమవారం నుంచి చెల్లిస్తామని, వాటి సేవలకు అంతరాయం కలిగించొద్దని నెట్‌వర్క్ ఆస్పత్రులను తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ ఎం.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో కోరారు.