దర్శకుడు రాఘవేంద్రరావుపై దాడికి యత్నం | attempt attack on Raghawedrarao | Sakshi
Sakshi News home page

దర్శకుడు రాఘవేంద్రరావుపై దాడికి యత్నం

Published Fri, Jun 10 2016 4:26 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

దర్శకుడు రాఘవేంద్రరావుపై దాడికి యత్నం - Sakshi

దర్శకుడు రాఘవేంద్రరావుపై దాడికి యత్నం

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై ఓ యువకుడు దాడికి యత్నించాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన వల్లిపి రవీంద్ర(28) గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిలింనగర్ సైట్-2లో నివసించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నివాసానికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు తన కారులో బయటకు వెళ్తుండగా రవీంద్ర కారును అడ్డగించి ఆయనను దుర్భాషలాడుతూ డోరు పగలగొట్టేందుకు యత్నించాడు. దీంతో అక్కడున్న వాచ్‌మెన్ కె.బాబు అడ్డుకున్నాడు. వాచ్‌మెన్‌ను కిందకు తోసేసి మళ్లీ రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి ఆయనను బయటకు లాగేందుకు యత్నించాడు.

దీంతో కారు అద్దాలు దించిన రాఘవేంద్రరావు 'ఎవరు నువ్వు.. ప్రాబ్లం ఏంటి' అంటూ ప్రశ్నించాడు. 2006లో తెరకెక్కించిన 'శ్రీరామదాసు' సినిమా కథ తనదేనని, ఆ కథను 2003లోనే రూపొందించి మీకు పంపించానని,  అయితే సినిమాలో మాత్రం కథ రచయితగా తన పేరు పెట్టకుండా మోసంచేశారంటూ రాఘవేంద్రరావును నిలదీశాడు రవీంద్ర. ఆ సినిమా కథ జేజే భారవిదని నీది కాదని రాఘవేంద్రరావు చెప్తుండగానే రవీంద్ర ఆయనను దూషిస్తూ సినిమా కథ తనదైతే ఆయన పేరు ఎలా పెడతావని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు తీవ్ర అన్యాయం చేశావని ఆరోపిస్తుండగానే రాఘవేంద్రరావు కారులో వెళ్లిపోయారు.

ఆ తర్వాత రవీంద్ర ఎదురుగా నిర్మాణంలోని భవనంలో ఓ రాడ్‌ను తీసుకొని రాఘవేంద్రరావు నివాసంలోకి చొచ్చుకెళ్లాడు. అక్కడ ఉన్న ఆడి కారు, బెంజి కారు, పక్కనే సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌పై దాడి చేశాడు. ఇళ్లంతా భీభత్సం సృష్టిస్తున్న సమయంలో రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రావు బయటకు వచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. ఆయనపై కూడా దాడి చేయడానికి యత్నిస్తున్న సమయంలో వాచ్‌మెన్ బాబు వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. ప్రకాశ్‌రావు కూడా రవీంద్రను పట్టుకొని సెక్యూరిటీ గదిలో వేసి పోలీసులకు సమాచారం అందించారు.

బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రను అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు రవీంద్ర బుధవారం సాయంత్రమే రాఘవేంద్రరావు ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బుధవారమే ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని, అవకాశం లేకపోవడంతో గురువారం మళ్లీ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాఘవేంద్రరావును భయభ్రాంతులకు గురి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement