అదుపులోకి తీసుకున్న షాద్‌నగర్ పోలీసులు
వారం రోజులపాటు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు
షాద్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులపాటు వారిని కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 8న నయీమ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన అనంతరం నయీమ్ భార్య హసీనాబేగం, అక్క సలీమాబేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నయీమ్ నేరాలపై విచారణ జరుగుతున్నందున మరింత సమాచారం సేకరించేం దుకు అతడికి సంబంధించిన నలుగురిని విచారణకు అవకాశం కల్పించాలని మంగళవారం షాద్‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్‌ఎన్. మూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఆ నలుగురిని బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జైలునుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు గంటలకు నేరుగా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ నిమిత్తం వారిని సిట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. కానీ, సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో స్థానిక పోలీసులే విచారణ జరిపినట్లు తెలిసింది.
పోలీసు కస్టడీకి నయీమ్ గ్యాంగ్
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠా సభ్యులను జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీమ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఫర్హానా, అఫ్సా, సాజీదాలను నార్సింగ్ పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపారు.