జూలై ఒకటిన తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జూలై 1న తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గేట్లు మూసి ఉంచేందుకు విధించిన గడువు ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో అదేరోజు అర్ధరాత్రి గేట్లు తీసి నీటిని దిగువకు వదలనున్నారు. ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లోని 7 లక్షల ఎకరాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై 2014లో సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది.
అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచిం చింది. ప్రస్తుతం ఎగువ మహారాష్ట్రంలో తీవ్ర గడ్డు పరిస్థితులున్న దృష్ట్యా దిగువకు ఏమాత్రం నీరొస్తుం దన్న విషయమై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.