అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణం
పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి ప్రపంచంలోనే ఓ పెద్ద కుంభకోణమని, సింగపూర్ సంస్థల కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా నిబంధనలు, చట్టాలు మార్చేస్తోందని శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం తెచ్చిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎనేబ్లింగ్ యాక్ట్ -2001’ను ఇష్టానుసారం మార్పులు చేసి సింగపూర్ సంస్థలకు మేలు చేయడానికి మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఇటీవల హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నుంచి తప్పించుకునేందుకే ఈ చట్టానికి మార్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు మేరకు వ్యవహరించాల్సిందిపోయి ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లడం గర్హనీయం అన్నారు. చంద్రబాబు చెబుతున్నట్లు అమరావతిలో సింగపూర్, లండన్, న్యూయార్క్ లాంటి మహానగరాలేమీ నిర్మించడం లేదన్నారు. అక్కడ ప్రభుత్వం పెట్టే రూ.12 వేల నుంచి 15 వేల కోట్లకు 42 శాతం వాటానా..? ఇది కుంభకోణం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
అంతా పథకం ప్రకారమే అప్పగింత..
అమరావతిలో రాజధాని నిర్మాణం అంటూ 2015 సెప్టెంబర్ 3న ప్రకటన, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఒప్పందం చేసుకోవడం, ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని అక్కడి ప్రభుత్వంలోని వాణిజ్య శాఖలో ముఖ్య అధికారి ఫ్రాన్సిస్ ఛాంగ్.. అసెండాస్, సిమ్‌కార్ప్ కంపెనీలకు లేఖ రాయడం.. తిరిగి ఏపీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఏ.గిరిధర్ ఆ కంపెనీలను ఆహ్వానించడం.. ఇలా అంతా ఓ పథకం చేశారన్నారు. వీటన్నింటిపై ఎవరైనా కోర్టుకు వెళితే భారీ కుంభకోణం వెలుగులోకి వస్తుందన్నారు. లోకేశ్ ఆస్తులు ఏడాదికేడాది తగ్గిపోతుండటం అంతా డ్రామా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బంజారాహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి విలువను గతంలో రూ.40 లక్షలుగా చూపించడమే అపహాస్యమన్నారు. చంద్రబాబుది స్పీడు కాదని, కన్ఫ్యూజన్ అని ఎద్దేవా చేశారు.