అసోం చెక్కేయాలని ‘బిగ్’ ప్లాన్
‘బిగ్‌బజార్’ చోరులు..
గతంలో అదే మాల్‌లో పలుమార్లు చిల్లర దొంగతనాలు
రాయదుర్గంలోనే పట్టుకున్నామన్న పోలీసులు
దొంగలకు రిమాండ్: డీసీపీ షానవాజ్
సుల్తాన్‌బజార్ : సొంత రాష్ట్రంలో స్థిరపడాలనే టార్గెట్‌తోనే కాచిగూడ బిగ్ బజార్‌లో చోరీకి పాల్పడినట్టు పట్టుబడ్డ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు పోలీసుల విచారణలో వెల్లడించారు. దొంగతనం చేసి పారిపోతుండగా 24 గంటల్లోనే వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 32.27 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సుల్తాన్‌బజార్ ఠాణాలో జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ షానవాజ్ ఖాసిం.. అదనపు డీసీపీ చంద్రశేఖర్, సుల్తాన్‌బజార్ ఏసీపీ టి .ఎస్.రవికుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన కమల్‌దాస్ (22), రతన్‌దాస్ అలియాస్ పప్పుదాస్ (20), రూపంకాలిటా (20), రజనీపెగ్ (24), ఫరాగా జోటిదాస్ (24)లు గతంలో కాచిగూడ బిగ్‌బజార్, ఐనాక్స్ సినీప్లెక్స్ కాంప్లెక్స్‌లో సెక్యురిటీ గార్డులుగా పనిచేశారు. వీరు స్థానిక రాజ్‌మొహల్లాలో అద్దెకు ఉంటున్నారు. వీరు మూడు నెలల క్రితం బిగ్‌బజార్‌లో చిన్నా చితకా చోరీలు చేశారు. నిర్వాహకులు గమనించకపోవడంతో భారీ చోరీకి ప్లాన్‌వేసి, చోరీ సొత్తుతో పారిపోయి అసోంలో స్థిరపడాలని భావించారు.
చోరీ జరిగిందిలా...
కాచిగూడ బిగ్‌బజార్ గురించి ముందుగానే తె లిసినదొంగలు ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు బిట్టు సహకారంతో బిగ్‌బజార్‌లోని 3వ అంతస్తు లోనుంచి 2వ అంతస్తులో ఉన్న ‘ఈ జోన్’కు చేరుకుని సీసీ కెమెరా కేబుళ్లను తొలగించారు. షాపులోనివే ముందుగా సిద్ధం చేసుకున్న ఏడు సూట్‌కేసులు, బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను సర్దుకున్నారు. అంతే కాకుండా వారు పోజులిస్తూ ఫొటోలు దిగారు. చోరీ చేసిన సొమ్ముతో రెండు ఆటోల్లో రాయదుర్గంలోని స్నేహితుల ఇంటికి వెళ్లారు.
విశాఖ నుంచి అసోం చెక్కేయాలని..
చోరీ చేసిన సొమ్ముతో విజయవాడకు అక్కడి నుంచి విశాఖపట్నం ఆ తర్వాత అసోంకు వెళ్లి దొంగిలించిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వ్యాపారంలో స్థిరపడాలని నిందితులు అనుకున్నారు. సొంత రాష్ట్రం పోతే హైదరాబాద్ పోలీసులు పట్టుకో లేరని భావించారు. అయితే, అసోంకు రైలు సోమవారం ఉండడంతో వారి ప్లాన్ మారింది. రాయదుర్గం నుంచి ప్రైవేటు బస్సులో విజయవాడకు పోవాలనుకున్నారు. కానీ, బిట్టు అనే సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఆధారంతో ఫోన్ సిగ్నల్‌ను ట్యాప్ చేసి దొంగలను రాయదుర్గంలోని వారి స్నేహితుల ఇంట్లో పట్టుకున్నామని డీసీపీ షానవాజ్ ఖాసిం వెల్లడించారు. కాగా, కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు పట్టుకుని హైదరాబాద్‌కు తరలించామని అక్కడి పోలీసులు సైతం అప్పటికే మీడియాకు వెల్లడించడం కొసమెరుపు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు అందిస్తామని డీసీపీ తెలిపారు.
దొంగిలించిన ఎలక్ట్రాన్ పరికరాలు ఇవే..
బిగ్‌బజార్‌లో దొంగలు సుమారు రూ. 40 లక్షలకు పైగా దొంగతనం చేశారని బిగ్‌బజార్ స్టోర్ మేనేజర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి రూ.32.27 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 105 సెల్‌ఫోన్లు, 12 ల్యాప్‌టాప్‌లు, 4 ట్యాబ్స్, 1 ఐప్యాడ్, 32 కెమెరాలు, 4 లెన్సులు, ఒక డీవీడీ ప్లేయర్, స్పీకర్ ఒకటి, 4 ట్రాలీ బ్యాగులు, 52 మొబైల్ చార్జర్లు, 6 ల్యాప్‌టాప్ బ్యాటరీలు, 42 డాటా కేబుళ్లు, 28 హెడ్‌ఫోన్స్, 7 ల్యాప్‌టాప్ చార్జర్లు, 12 కేబుల్ చార్జర్లు, 2 కెమెరా బ్యాటరీలు, 45 కేబుల్ వైర్లు ఉన్నాయి.