కుషాయిగూడ, న్యూస్‌లైన్: అందరి ఇళ్లల్లో కృష్ణాష్టమి వేడుకలకు చిన్నారులు సిద్ధమవుతుంటే.. మరో పక్క తల్లిచేతి గోరు ముద్దలు తింటూ ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న ఆ చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోయాయి. తల్లి చూస్తుండగానే టీవీ రూపంలో వచ్చిన మృత్యువు పైనబడి ఆ బాలుడి ని కబళించింది. హృదయ విదారకమైన ఈ సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్‌లో చోటుచేసుకుంది. బొమ్మల రామారంలోని ‘బాంబుల కంపెనీ’లో మేనేజర్‌గా పనిచేస్తున్న శంకర్ రెడ్డి.. భార్య ప్రణతి ఇద్దరు కుమారులతో నాగార్జున నగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు(3)కి టిఫిన్ తినిపించిన ప్రణతి.. చిన్న కుమారుడు ప్రణవ్ (16నెలలు)కు కూడా గోరు ముద్దలు తినిపించింది.
ఉదయం పదకొండు గంటలకు కొడుకుకు స్నానం చేయిద్దామని ఆమె బాత్‌రూంలోకి వెళ్లింది. అదే సమయంలో ఇల్లంతా పాకుతూ ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా టీవీ స్టాండ్‌ను పట్టుకొని లాగాడు. వీల్స్‌పై ఉన్న టీవీ ఒక్కసారిగా ఆ చిన్నారిపై పడంది. ఆ శబ్దానికి గాబరా పడుతూ బయటకు వచ్చిన ప్రణతి బిడ్డని ఒళ్లోకి తీసుకుంది. అప్పటికే తిన్నదంతా వాంతి చేసుకుని సొమ్మసిల్లిన ప్రణవ్‌ను ఇరుగు, పొరుగు సహాయంతో ఆమె స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. అయితే అప్పటికే ఆ బాలుడు మృతిచెందాడని తెలియడంతో ఆమె హతాశురాలైంది. విషయం తెలిసిన భర్త, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడిని మంగళవారం సాయంత్రం వారి స్వస్థలం నల్లగొండ జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామంలో ఖననం చేశారు.
టీవీ పడి బాలుడి మృతి
Published Wed, Aug 28 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement