
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు ప్రధాన న్యూస్‌చానల్స్‌లో ప్రసారమవుతున్న బ్రేకింగ్ న్యూస్.. బిజినెస్ న్యూస్‌గా మారాయని, జర్నలిస్టులు బిజినెస్ ట్రేడర్స్‌గా మారారని సీనియర్ జర్నలిస్ట్, ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నా రు. ఆదివారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌లో లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘మీడియా ఇన్ ది ఏజ్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్’అన్న అంశంపై జరిగిన సదస్సులో రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం 397 న్యూస్, కరెంట్ అఫైర్స్ చానల్స్ ఉన్నాయని.. ఇవన్నీ రాజకీయ నాయకులు, పార్టీ లు, బిల్డర్ల చేతిలోనే ఉన్నాయని, వీరంతా తమ వాణిజ్య, రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం చానల్స్ నడుపుతున్నారన్నారు.
క్రమేణా నైతిక విలువలు కనుమరుగవుతుండటంతో ప్రస్తుతం మీడియా విశ్వసనీయత కోల్పోతోందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లోని 25 ప్రధాన న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీల చేతిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పలు ప్రధాన చానల్స్‌లో ప్రసారమవుతున్న వార్తల్లో వాస్తవికత ఉండట్లేదని, టీవీ స్టూడియోల్లో అర్థవంతమైన చర్చలకు బదులు అనవసర వివాదాలు జరుగుతూండటం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ అపరిమితమని.. కానీ బాధ్యత శూన్యంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్వేచ్ఛా గొంతుక వినిపించేందుకు బెటర్ మీడియా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ న్యూస్ కాపిటల్స్‌గా మారాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment