వాటీజ్ గుడ్...?
చిక్కడపల్లి లాంటి చోట ఓ క్లర్కు సూర్యారావు లాంటి చిన్న గుమస్తా చాలీచాలని జీతంతో మిడుకుతుంటాడు. ఓ చిట్టీ మీద రూమ్ అద్దె, పాలు, పచారీ సరుకులు, బియ్యం, ఉప్పులూ పప్పులతో పాటు చివర్లో సుఖం అని కూడా రాసుకుంటాడు. అన్నిటికీ పక్కన రేట్లు వేసుకుని ఒబ్బిడిగా బతుకుతుంటాడు.
చివర్లో సుఖం కోసం ఓ వేశ్యని బుక్ చేసుకుంటాడు. ఆవిడ నెలకి రెండుసార్లు వచ్చి పోతుంటుంది. ప్రభుత్వం వారు బడ్జెట్ పెట్టినందువల్ల సరుకుల రేట్లన్నీ పెరుగుతాయి. ఒకనాడు వచ్చినావిడ వెళ్లే ముందు చీర సవరించుకుంటూ.. ‘‘యావండీ.. అన్ని రేట్లూ పెరిగాయి. మీ ఇంటికి వచ్చిపోవడానికి బస్సుచార్జీలు కూడా పెంచేశారు.
నాక్కూడా మీరు రేటు పెంచాలండీ’’ అంటుంది. మన క్లర్కు రావు మటుకు తలపెకైత్తి ‘‘ఇక నుంచి నెలకు ఒకేసారి రా’’ అని చెప్తాడు. అదీ కథ. పోస్టు కార్డు మీద రాసే కథల పోటీలో చంద్రకి మొదటి బహుమతి వచ్చినట్టు గుర్తు. బడ్జెట్ అంటే గవర్నమెంటువారు మన వాకిట్లోకీ, నట్టింట్లోకీ, వంటగదీ, పడగ్గదిలోకీ తోసుకొచ్చే బాలక్రిష్ణ లాటిదనమాట. అది మన తిండీ తిప్పల్నీ, నవ్వులూ, ఏడుపుల్నీ కంట్రోల్ చేసే యంత్రం. పెద్దమాటగా చెప్పాలంటే రాజ్యాంగయంత్రం.
ఒకప్పుడు ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్‌కి క్యూబన్ స్టార్ డెరైక్టర్ వచ్చాడు. ఆయన ఫిలిం ఉత్తమ చిత్రంగా ఎన్నికైనందున రిపోర్టర్లంతా చుట్టూ చేరి చాలా ప్రశ్నలేశారు. వర్ధమాన దేశాల్లో డెరైక్టర్లకు సినిమా సబ్జెక్టుల కొరత ఉందని విలేకరులు బెంగపడ్డారు. వెంటనే ఆయన ‘‘సబ్జెక్టులకు లోటేముంది. ఈ పూట మీరు ఎన్ని అన్నం ముద్దలు మింగాలో మీ ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఈ విషయం మీదే సినిమా తియ్యొచ్చు.’’ అన్నాడు. అలాగని ఈ పేపరు చదవడం ముగించి వేంటనే షార్ట్ ఫిలిం లాగుదామని తొందరపడి పోకండి.
నెహ్రూ గారి కాలంలో ‘శంకర్స్ వీక్లీ’ అనే కార్టూన్ మ్యాగజీన్ ప్రతివారం వచ్చేది. ఎడిటర్ శంకర్ నెహ్రూకి వీరాభిమాని. కాని కార్టూన్‌లలో చురకలుండేవి. బడ్జెట్‌కు ముందు పెట్టుబడిదార్లను తృప్తిపరచడం కోసం నెహ్రూ తంటాలు పడుతుంటాడు. టాటాబిర్లాలిద్దరూ మూతి ముడుచుకుని వెనక్కి తిరిగి నుంచునుంటారు. నెహ్రూ తన ఆర్థికమంత్రితో కలిసి ఒక బంగారుపళ్లెంలో కేబినెట్ మినిస్టర్‌ను తీసుకొచ్చి సమర్పిస్తాడు. టాటాబిర్లాలకు ఏమాత్రం గిట్టదు.
ఎలాగైనా వాళ్లని మెప్పించాలని వరసగా ఒక్కొక్క మినిస్టర్‌నే తెచ్చి తాకట్టు పెట్టుకున్నా వాళ్లిద్దరూ మొహం మాడ్చుకునే ఉంటారు. చివరికి నెహ్రూనే స్వయంగా పళ్లెంలో కూచుని దాని అంచులు పట్టుకుని సమర్పించుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరి మొహాలు వికసించి నవ్వుతారు.
‘ప్రభుత్వమంటే కొద్దిమంది పెట్టుబడిదార్ల వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ’ మాత్రమేనన్నాడు కారల్ మార్క్స్. వాళ్ల జమాఖర్చులే బడ్జెట్ అనుకోవచ్చు. మార్క్స్ చెప్పినంతటి చిక్కుముడి లేకుండా భారీ బిజినెస్‌మేన్సే పార్టీలను కొని, టికెట్లు కొని డెరైక్టుగా మంత్రులైపోతున్నారు గనక వాళ్ల తరఫున వేరే గవర్నమెంట్ పని చెయ్యాల్సిన ముచ్చటే లేదు. వీళ్లే గవర్నమెంటు.
రిలయన్స్ లాంటి వాళ్లిచ్చిన వేలకోట్లతో, రిలయన్స్ మీడియా ప్రచారహోరులో గెలిచినవాళ్లు ఆ కంపెనీ గీసిన గీత దాటుతారనుకోవడం వెర్రేకాదు సర్రియలిజం కూడాను. అమెరికాలో ఒకప్పుడీ మాట ప్రచారంలో ఉండేది. ‘‘వాటీజ్ గుడ్ ఫర్ జనరల్ ఎలక్ట్రిక్(జి.ఇ.) ఈజ్ గుడ్ ఫర్ అమెరికా’’ఇప్పుడు మనమూ చక్కగా అనుకోవచ్చు. ‘‘వాటీజ్ గుడ్ ఫర్ రిలయన్స్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా’’ ... ఛీర్స్!
మోహన్‌ఆర్టిస్ట్