హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాజధాని సెంటిమెంట్ను చంద్రబాబు తన దోపిడికి అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. స్విస్ చాలెంజ్ పద్దతిని వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రజా రాజధాని కాదు... చంద్రబాబు పెట్టుబడిదారుల రాజధాని అని ఆయన ఎద్దేవా చేశారు.
రైతుల భూములు తీసుకుని చంద్రబాబు తనకు నచ్చిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. గతంలో రాచరికంలో కూడా ఇలా జరిగి ఉందన్నారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదని చంద్రబాబుకు రామచంద్రయ్య ఈ సందర్బంగా సూచించారు. రాజధాని నిర్మిణ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేసి... బహిరంగ టెండర్లు పిలవాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.