'బాబుపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ దుస్థితి' | c ramachandraiah supports to jagan and criticises chandrababu | Sakshi
Sakshi News home page

'బాబుపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ దుస్థితి'

Published Wed, Feb 14 2018 5:07 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

c ramachandraiah supports to jagan and criticises chandrababu - Sakshi

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య

సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల అజెండాగా మారిందని, కేంద్రం వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. ప్రజల అజెండాగా మారిన ప్రత్యేక హోదాపై రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇస్తుంది. మొదటి నుంచీ విభజన హామీల్లో పేర్కొన్న అంశాలను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది.

ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కోటి సంతకాలను సేకరించాం. మొదటి నుంచి కూడా ఏపీ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిస్తూనే ఉంది. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారే తప్ప దాని వల్ల కలిగే లాభాలను మాత్రం ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిల్లో అరుంధతి నక్షత్రం మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీ కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు తాను తెచ్చినన్ని నిధులు ఏ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడం నిజం కాదా?.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి. విభజన హామీల కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోకుండా ఒక్కడే పోయి ఏం తెచ్చి పెట్టాడో చంద్రబాబుకే తెలియాలన్నారు. 

సీఎం చంద్రబాబు ఇంతవరకూ అఖిలపక్షం నిర్వహించక పోవడం దారుణం. హోదా కోసం వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తుంటే ఆ అంశంపై సైతం దుష్ప్రచారం చేయడం శోచనీయం. నిజం చెప్పాలంటే చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ గతి పట్టింది. చంద్రబాబు తనపై ఉన్న కేసుల భయంతోనే కేంద్రాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జేఏసీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. పెద్ద నేతలను ఇటువంటి వాటికి వాడుకోవడం సమంజసం కాదని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement