హార్ట్ ఎటాక్ వచ్చినా.. డ్రైవర్ సమయస్ఫూర్తి!
హైదరాబాద్: క్యాబ్ నడుపుతూనే ఓ డ్రైవర్ డ్రైవింగ్ సీట్లోనే తుదిశ్వాస విడిచాడు. అయితే ఇతర వాహనదారులకు, పాదచారులకు ప్రమాదం జరగకుండా చూడటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి హిమాయత్‌నగర్‌వైపు వెళుతున‍్న క్యాబ్ ( ఏపీ29 టి.వి 1964) డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఛాతీలో నొప్పి రావడంతోనే అప్రమత‍్తమైన డ్రైవర్ కారును స్లో చేశాడు. రోడ్డుపక‍్కనున‍్న గాంధీ కుటీర్ బస్తీ మలుపులో ఆపేసి స్టీరింగ్‌పైనే కుప‍్పకూలిపోయాడు.
ఇది గమనించిన స్థానిక బస్తీవాసులు కారు డోరు తెరిచి డ్రైవర్‌ను కాపాడే ప్రయత‍్నం చేసి వెంటనే సమీపంలోని ఆస‍్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను పరీక్షించిన వైద‍్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం ఉస్మానియా ఆస‍్పత్రికి తరలించారు. తనకు ప్రాణాపాయం ఉన్నా.. తన కారు అదుపుతప్పితే ప్రమాదమని భావించిన క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేయడాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.