డిస్కంలకు హైకోర్టు ఊరట
ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటుపై సింగిల్‌జడ్జి తీర్పు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ప్రీ పెయిడ్ మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా కోరుకునే హైటెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ వినియోగదారులందరికీ ఆరు నెలల్లో ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు గతవారం తీర్పు వెలువరించింది. ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులో లేవని, అందువల్ల హెచ్‌టీ వినియోగదారులకు వాటిని అమర్చలేకపోతున్నామన్న డిస్కంల వాదనలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ డిస్కంలు దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. మీటర్లు బిగించే సమయంలో తమ నుంచి నిర్దేశిత మొత్తాలను వసూలు చేసిన డిస్కంలు ఇప్పుడు మళ్లీ అదనపు విద్యుత్ వినియోగ డిపాజిట్‌ను కోరుతున్నాయని, ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ పలువురు హెచ్‌టీ వినియోగదారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ జడ్జి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు డిస్కంల వాదనలను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల డిస్కంలు అప్పీళ్లు దాఖలు చేశాయి.