సీఎంకు ఎందుకు భయం?
భూముల స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎందుకు భయపడుతున్నాడని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీతో కలసి శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ కె.కేశవరావు, కార్పొరేటర్ అయిన ఆయన కూతురు విజయలక్ష్మిపై ఈ విషయంలో ఆరోపణలు వస్తున్నాయన్నారు.
సీఎం పేషీ అధికారులు, రెవెన్యూ శాఖ పేషీ అధికారులతో పాటు ప్రభుత్వంలో ముఖ్యులైన వారిపైనా ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ భూములను వేలం వేయాలని, వచ్చిన ఆదాయంతో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూములను కాపాడటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వాటర్‌గ్రిడ్‌కు, రైతులను ఆదుకోవడానికి వాడుకోవచ్చునన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ చేప విత్తనాల వల్ల జరిగిన నష్టంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు.