
హైదరాబాద్‌లో సెల్‌ఫోన్ తయారీ హబ్
హైదరాబాద్: రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వాటికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు సదుపాయాలను కూడా కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు మంగళవారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. మొబైల్ హార్డ్‌వేర్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా దేశంలోనే మొదటి మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసీజా, ఫాక్స్‌కాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు యోయో, జోహ్‌ఫౌల్టర్, సెల్‌కాన్ ఎండీ వై.గురు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మరళి, వాటర్‌వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని తదితరులు సీఎంను కలిశారు. అంతకు ముందు వారంతా మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థల ం కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలోని మామిడిపల్లి, మహేశ్వరం, రావిర్యాల్ ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. ఈ హబ్ ద్వారా సుమారు రెండు లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.