ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో (2014-15) తాము ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. నిధుల వ్యయానికి సంబంధించిన వినియోగ పత్రాలను సమర్పిస్తే గానీ తదుపరి నిధులను విడుదల చేయబోమని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్నిరోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులను విడుదల చేస్తున్నట్లుగా జీవోలను మాత్రం జారీ చేసింది. వాస్తవంగా డబ్బులు మాత్రం విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రూ.500 కోట్లను, అలాగే గుంటూరు, విజయవాడల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లను విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఆ పనుల కోసం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించింది.
పెపైచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులను ఏ ఏ అంశాలకు ఖర్చు చేశారో వివరాలతో కూడిన వినియోగ పత్రాలను పంపాలని, ఆ తరువాతనే తదుపరి నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసిం ది. దీంతో ప్రభుత్వం హడావుడిగా ఆదివారం రోజున 19వ తేదీతో రాజధానిలో రాజభవన్, హైకోర్టు నిర్మాణాలకు గాను రూ.500 కోట్లను సీఆర్‌డీఏకు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. ఈ నిధులను పీడీ ఖాతాలో ఉంచుకోవాలని జీవోలో పేర్కొన్నారు. అలాగే గుంటూరులో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.540 కోట్లు, విజయవాడలో వరద నీటి డ్రైనేజీ పనుల కోసం రూ.480 కోట్లు ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేవలం జీవోలు జారీ చేసినంత మాత్రాన ఆ నిధులను ఖర్చు చేసినట్లుగా కేంద్రానికి వినియోగ పత్రాలను సమర్పించలేమని, ఒకవేళ సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్రానికి తెలుస్తుందని, అప్పుడు అసలుకే మోసం వస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.